అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’. రచయితగా పలు సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన అనుభవం ఉన్న వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇప్పటికే టీజర్ వరకూ వచ్చింది ఈ సినిమా. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

ఇంతలోనే ఈ సినిమా పై కొత్త రూమర్లు తెరపైకి రావడం విశేషం. ఇదొక హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందుతోందనే మాట వినిపిస్తోందిప్పుడు. Antwone Fisher అనే సినిమా ఆధారంగా ‘నా పేరు సూర్య...’ ను తెరకెక్కించారనే ప్రచారం జరుగుతోంది. ‘Finding Fish’ అనే నవల ఆధారంగా వచ్చిన Antwone Fisher సినిమా పదిహేనేళ్ల కిందట విడుదల అయ్యింది.

ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు డేంజల్ వాషింగ్టన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. యాంగర్ మేనేజ్ మెంట్ తో ఇబ్బంది పడే ఒక సోల్జర్ కథాంశమే ఆ సినిమా కథ. అతడి ప్రవర్తనతో విసిగిన అధికారులు.. అతడి తీరు సరిగా ఉందని సైకియాట్రిస్ట్ దగ్గరకు పంపడంతో కథనం.. సాగుతుంది. అల్లు అర్జున్ సినిమా కూడా అదే కథనంతో సాగుతుందని సమాచారం. అయితే ఇదంతా రూమర్ మాత్రమే. అసలు కథ ఏమిటనేది ‘నా పేరు సూర్య..’ దర్శకుడికే తెలియాలి.