బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఆత్మహత్యతో దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలోని నెపోటిజం వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అలాగే తాము సైతం దీని బారినపడ్డామంటూ రోజుకొకరు సోషల్ మీడియా ద్వారానో, నేరుగానో చెబుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి దిగ్గజ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సైతం చేరారు.

Also Read:కంగనా కూడా నెపోటిజం ప్రాడక్టే.. సీనియర్‌ నటి సంచలన వ్యాఖ్యలు

తనకు సంబంధించిన కొన్ని పుకార్లు ఇండస్ట్రీలో వ్యాపించాయని, దీని వెనుక ఓ ముఠా ఉందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మ్యూజిక్ లవర్స్, బాలీవుడ్ తన నుంచి చాలా ఆశిస్తోందని.. కానీ సదరు గ్యాంగ్ మాత్రం అడ్డుపడుతోందని రెహ్మన్ వ్యాఖ్యానించారు.

రేడియో మిర్చి ఆర్‌జే సురేశ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. బాలీవుడ్ సినిమాలకు సంగీతాన్ని ఎందుకు కంపోజ్ చేయలేదన్న ప్రశ్నకు రెహమాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మంచి సినిమాలకు ఎప్పుడూ నో చెప్పలేదని, కానీ ఒక ముఠా  తనపై పుకార్లను వ్యాప్తి చేస్తోందని ఆయన చెప్పారు.

Also Read:విలక్షణ నటుడి సంచలన వ్యాఖ్యలు.. నేను కూడా సుశాంత్‌ లాగే!

సినిమాలను తన వరకు రానీయకుండా కుట్ర చేస్తున్నారని.. తాను అడిగిన సమయానికి స్వరాలు ఇవ్వరనే ప్రచారం చేస్తున్నారని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. రెహమాన్ దగ్గరికి వెళ్లొద్దని బాలీవుడ్‌లో దిల్ బెచెరా దర్శకుడు ముఖేశ్ ఛబ్రాకు కొందరు చెప్పారని గుర్తుచేశారు.

కానీ ఛబ్రాకు కేవలం రెండు రోజుల్లోనే నాలుగు పాటలకు స్వరాలు కూర్చానని రెహమాన్ వెల్లడించారు. కాగా తమిళ, తెలుగు భాషల్లో అనేక మ్యూజికల్ హిట్స్  ఇచ్చిన ఏఆర్ రెహమాన్ హిందీలో తమాషా, రాక్‌స్టార్, గురుతో సహా ఎన్నో బాలీవుడ్ సినిమాలకు స్వరాలు అందించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బెచారాకు రెహమాన్ స్వర కల్పన చేశారు.