రవితేజ హీరోగా వచ్చిన `కృష్ణ` చిత్రంలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ముకుల్ దేవ్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరుడు రాహుల్ దేవ్.. తమ్ముడి మరణానికి కారణం ఏంటో తెలిపారు.
ఇటీవల మరణించిన నటుడు ముకుల్ దేవ్ తెలుగులో చాలా సినిమాలే చేశారు. `కృష్ణ`, `ఏక్ నిరంజన్`, `కేడి`, `అదుర్స్`, `బెజవాడ`, `నిప్పు` వంటి చిత్రాల్లో విలన్‌గా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. కానీ ఆ తర్వాత తెలుగులో అంతగా మూవీస్ చేయలేదు. హిందీకే పరిమితమయ్యారు. ఆయన బ్రదర్ రాహుల్ దేవ్ కూడా అనేక తెలుగు చిత్రాలు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ముకుల్ దేవ్ హఠాన్మరణం చెందారు. మే 23, 2025 రోజున ఆయన మరణించారు. డిప్రెషన్ కారణంగా.నే ఆయన చనిపోయినట్టు ప్రచారం జరిగింది. అయితే, 24 రోజుల తర్వాత, ఆయన సోదరుడు రాహుల్ దేవ్ ఈ వార్తలను ఖండించి, అసలు కారణాన్ని వెల్లడించారు.
ముకుల్ దేవ్ ఎలా చనిపోయారు?
అన్న రాహుల్ దేవ్ చెప్పిన దాని ప్రకారం, ముకుల్ దేవ్ కలుషితమైన ఆహారపు అలవాట్ల వల్ల మరణించారని, సరైన ఫుడ్ తీసుకోలేదని తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, `ముకుల్ ఎనిమిదన్నర రోజులు ICUలో ఉన్నారు. వైద్యుల చెప్పినదాని ప్రకారం, ఇది చెడు ఆహారపు అలవాట్ల వల్లే జరిగింది.
చివరి నాలుగు, ఐదు రోజులు ఆయన ఏమీ తినలేదు, త్రాగలేదు. ఒంటరితనాన్ని ఎక్కువగా ఫేస్ చేశాడు. బ్రతకాలనే కోరిక చచ్చిపోయింది. చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించారు. అంత్యక్రియల తర్వాతే నాకు అసలు విషయం అర్థమైంది, దీంతో ఆ బాధ ఇంకా ఎక్కువైంది` అని అన్నారు.
2019లో ఢిల్లీకి మారారు ముకుల్ దేవ్
2019లో తండ్రిని చూసుకోవడానికి ముకుల్ దేవ్ ఢిల్లీకి మారారని, అదే సంవత్సరం ఆయన తండ్రి చనిపోయారని రాహుల్ చెప్పారు. 2023లో ఆయన తల్లి కూడా చనిపోయారు. ముకుల్ ఒంటరిగా ఉండి, రచనపై దృష్టి పెట్టారని అన్న రాహుల్ అన్నారు.
తన కూతురిని చాలా మిస్ అవుతున్నారని, తనను తాను చూసుకోలేకపోయారని, ఒంటరితనం వల్ల ఎవరూ సహాయం చేయలేకపోయారని రాహుల్ చెప్పారు.
డిప్రెషన్ వార్తలపై రాహుల్ ఆగ్రహం
ముకుల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, దాని వల్లే చనిపోయారనే రూమర్స్ పై రాహుల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఆయనతో సంబంధం పెట్టుకోలేదు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని అంటున్నారు, కానీ ఆయన హాఫ్ మారథాన్ పూర్తి చేశారు. బరువు పెరిగింది, ఎందుకంటే తనను తాను చూసుకోవడం మానేశారు.
2019 నుండి 2024 వరకు ఆయన్ని మీరు చూశారా?. ఆయన్ను ఆసుపత్రిలో చూడటానికి వెళ్లారా? ప్రార్థన సభకు హాజరయ్యారా?" అని ప్రశ్నించారు. ముకుల్ చాలా చమత్కారమైన, తెలివైన, సున్నితమైన వ్యక్తి అని, ఆయన్ను అలాగే గుర్తుంచుకోవాలని రాహుల్ వెల్లడించడం విశేషం.