స్వచ్ఛ భారత్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ బీజేపీ సర్కార్ ఏర్పడ్డాక స్వచ్ఛత, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత స్వచ్చ భారత్ లో పాల్గొనాలని ప్రభాస్, రాజమౌళి, రజినీ, మోహన్ బాబు లకు ప్రధాని లేఖ
ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యతనిస్తున్న అంశాల్లో స్వఛ్చ భారత్ ఒకటి. బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాతత్మకంగా తీసుకున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మోదీ సహా దేశవ్యాప్తంగా రాజకీయ నేతలే కాకుండా సినీ ప్రముఖులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక తెలుగు స్టార్స్ లో నాగార్జున, అమల తదితరులు స్వచ్ఛ భారత్ లో ప్రతిసారీ విధిగా పాల్గొంటుంటారు.
ఇక తాజాగా దర్శకధీరుడు రాజమౌళితో పాటు తెలుగు సినీ నటులు మోహన్‌బాబు, ప్రభాస్, మహేశ్‌బాబు తదితరులకు నరేంద్ర మోదీ ప్రత్యేక లేఖలు రాశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘స్వచ్ఛతా హీ సేవా’ (స్వచ్ఛతే సేవ) కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మోదీ తన లేఖలో కోరారు. దేశంలో స్వచ్ఛత పెంపొందించడానికి కృషి చేయాలంటూ మోదీ పలువురు ప్రముఖులకు లేఖ రాస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్, మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు కూడా మోదీ లేఖ రాశారు.
‘గాంధీజీ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది సమాజం పట్ల మనకున్న వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో మీరూ భాగస్వాములు అవుతూ, మరింత మంది పాల్గొనేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. స్వచ్ఛతే సేవ ఉద్యమం కోసం కొంత సమయాన్ని కేటాయించండి. బాపూకి మనమిచ్చే నిజమైన నివాళి ఇదే’ అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గత వారం ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పార్లమెంటేరియన్లు తప్పనిసరిగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని మోదీ ఇప్పటికే సూచనలు జారీ చేశారు. నవ భారత్ నిర్మాణంలో ‘క్లీన్ ఇండియా’ ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్న మోదీ.. స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ప్రేరణగా నిలవాలని కోరారు. చివరగా ‘జైహింద్’ అంటూ తన లేఖను ముగించారు.
