ఖైదీ నెంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి తన పవర్ ఏంటో చూపిచ్చిన మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ ను దృష్టిలో పెట్టుకుని భారీ హిట్ కోసం ప్లాన్ చేసి మరీ సైరా నరసింహారెడ్డి సినిమాను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

 

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబోతున్న ఈ 'సై రా... నరసింహా రెడ్డి' తెలుగులో 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో వచ్చే సినిమా కాబోతోంది. ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా హిందీ, తమిళంలో ఒకేసారి తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ తారాగణంతో పాటు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు హిందీలో భారీ క్రేజ్ తెచ్చేందుకు బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్‌ను ఇందులో నటించేందుకు ఒప్పించారు.

 

‘సై రా...' చిత్రానికి అమేజాన్ నుండి భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘ప్రైమ్ వీడియో' పేరుతో ఆయన్ లైన్ మూవీ స్ట్రీమింగ్ వెబ్ సైట్ రన్ చేస్తున్న అమేజాన్ ‘సై రా..' డిజిటల్ రైట్స్ దక్కించుకునేందుకు భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సినిమా బడ్జెట్‌లో 20 శాతం వెచ్చించేందుకు రెడీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సై రా...' బడ్జెట్‌లో 20 శాతం వెచ్చించి సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసేందుకు అమేజాన్ ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాత రామ్ చరణ్‌ను చిత్ర నిర్మాతలు కలిసినట్లు తెలుస్తోంది.

 

ఈ డీల్ విషయంలో రామ్ చరణ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. డీల్ ఓకే అయితే నిర్మాతగా రామ్ చరణ్ కు మంచి ప్రాఫిట్ వస్తుందని అంటున్నారు. ఈ చారిత్రక చిత్రం నుంచి సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ తప్పుకున్నారు. ఇతర కమిట్‌మెంట్స్‌తో డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోవడమే కారణం. ఆయన స్థానంలో రత్నవేలును సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు.

 

సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తప్పుకుంటున్నాడంటూ పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది కేవలం పుకారే అని, ఇందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్రలో నటించబోతున్నారు అనేది త్వరలో ప్రకటించనున్నారు.

డేరింగ్ స్టార్ జగపతి బాబు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ పాత్ర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర తెలిపింది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేయబోతున్నారు. బాహుబలి సినిమాలోనూ కిచ్చా సుదీప్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సుదీప్ ద్వారా కన్నడ మార్కెట్ వశం చేసుకోవచ్చనే ఉద్దేశ్యం కనిపిస్తోంది.

క్వీన్ ఆఫ్ ఆఫ్ సౌతిండియా సిల్వర్ స్క్రీన్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఈవిడ నటించబోతోంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి ద్వారా తమిళ మార్కెట్ లో మంచి వసూళ్లు సాధించవచ్చని దర్శక నిర్మాతల ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్‌గా రాజీవన్ పని చేస్తున్నారు. గతంలో రాజీవన్ పలు అద్భుతమైన సినిమాలకు ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు. సైరా నరసింహారెడ్డి చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచయితలు. మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, రచనా సహకారం: సత్యానంద్‌.

మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సైరా చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సురేందర్ రెడ్డి కెరీర్లోనే ఇది అతి పెద్ద ప్రాజెక్ట్. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారాయన.