బిగ్ బాస్ హౌస్ లో పోటీదారులతో పాటు అప్పుడప్పుడు మరికొందరు సెలబ్రిటీలు కూడా హల్చల్ చేస్తుంటారు. తమ సినిమాలు విడుదలకు ఉన్న హీరో, హీరోయిన్లు ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ కి వస్తుంటారు. తాజాగా మెగాహీరో సాయి ధరం తేజ్ కూడా బిగ్ బాస్2 లోకి అతిథిగా ఎంట్రీ ఇచ్చాడు. దానికి సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కానుంది. షోలో సాయి ధరం తేజ్ తో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా పాల్గోనుంది.

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. తేజ్ హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే కంటెస్టంట్ తేజస్వి అతడి హగ్ చేసుకుంది. 'నా బర్త్ డేకి కేక్ తీసుకురాలేదా బావా..?' అంటూ తేజ్ ను అడిగింది. దానికి సమాధానంగా 'నీ మొహానికి నేను రావడమే ఎక్కువ ఇంకా కేక్ కూడానా..?' అంటూ సెటైర్ వేశాడు. గతంలో సాయి ధరం తేజ్ నటించిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలో తేజ్ కు మరదలి పాత్రలో నటించింది తేజస్వి.

ఆ చనువుతోనే అతడిని బావ అని పిలుస్తూ అల్లరి చేసింది. సామ్రాట్, తనీష్ లను ఉద్దేశించి వేసిన పంచ్ లు బాగా పేలాయి. అనుపమ.. తేజ్ సినిమాలో ఒక పాటను పాడి వినిపించింది. ఇలా ఈరోజు ఎపిసోడ్ మొత్తం సరదాగా సాగిపోనుంది. ఇక షో విషయానికొస్తే.. ఈ వారంలో కౌశల్, గణేష్ ను ఎలిమినేషన్ కోసం ఎక్కువగా నామినేట్ చేశారు. అలానే నందిని, తేజస్వి, బాబు గోగినేని, దీప్తి లు కూడా నామినేట్ అయ్యారు. మరి ఈ వారంలో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి!