చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిన్నప్పుడు మంచి స్నేహితులు. ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులయ్యారు. ఆ కథ ఇప్పుడు `మాయసభ` పేరుతో వెబ్‌ సిరీస్‌ రూపొందింది. 

నారా చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా మారకముందు మంచి స్నేహితులు. కాలేజీ రోజుల నుంచి ఇద్దరి మధ్య ఆ స్నేహం ఉంది. అన్‌ స్టాపబుల్‌ షోలో చంద్రబాబునే ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో ఇద్దరు కలిసి చేసిన అల్లరిని వెళ్లడించారు. అయితే చంద్రబాబు టీడీపీలో చేరారు, వైఎస్‌ కాంగ్రెస్‌లో ఉన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ నీడ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌కి ప్రత్యర్థిగా మారారు. ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా నువ్వా, నేనా అనేంత వరకు వెళ్లారు. ఆ ఎపిసోడ్‌ని ప్రధానంగా చేసుకుని ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ వస్తోంది. `మాయసభ` పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు.

చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ స్నేహంపై వెబ్‌ సిరీస్‌

ఈ `మాయసభ` వెబ్‌ సిరీస్‌కి `రైజ్ ఆఫ్ ది టైటాన్స్` అనేది ట్యాగ్ లైన్. విలక్షణ దర్శకుడు దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు.

ఇద్దరు గొప్ప స్నేహితులు.. అయితే వారి రాజకీయ ప్రస్థానాలు వారి మధ్య తెలియని దూరాన్ని పెంచాయి. మానసికంగా ఎంత దగ్గరి వారైనా రాజకీయ చదరంగంలో ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకోక తప్పలేదు.

 అలాంటి ఇద్దరు స్నేహితుల కథే ‘మాయసభ’. ఇందులో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, ఎం.ఎస్.రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు, ఐరావతి బసు పాత్రలో దివ్య దత్తా నటించారు.

`మాయసభ` వెబ్‌ సిరీస్‌ టీజర్‌

జీవితంలో ఏదో సాధించాలి, ప్రజలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఇద్దరు స్నేహితుల దారులు ఎలా మారాయి? చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారే.. రాజకీయ గమనంలో ప్రత్యర్థులుగా ఎలా మారారు. 

ఇద్దరి గొప్ప స్నేహితుల మధ్య ఉండే స్నేహం, మానసిక సంఘర్షణ, పొలిటికల్ జర్నీలో వారు ఎదుర్కొన పరిస్థితులను భావోద్వేగంగా ఆవిష్కరించిన వెబ్ సిరీస్ ‘మాయసభ’. 

ఈ సిరీస్ సోనీ లివ్‌లో ఆగస్ట్ 7 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈసందర్భంగా శనివారం రోజున సోనీ లివ్ ‘మయసభ’ టీజర్‌ని విడుదల చేశారు. .

నాయుడు, రెడ్డిల మధ్య డైలాగ్‌ వార్‌

ప్రతి సన్నివేశంలో ఓ ఎమోషన్, ఫ్రెండ్ షిప్, ఎత్తుకు పై ఎత్తులు వేసే రాజకీయ చదరంగం.. ఎదుర్కొన్న ఆటు పోట్లు అన్నింటినీ దేవా కట్టా టీజర్‌లో అద్భుతంగా ఆవిష్కరించారు. 

ఇందులో పెద్దాయన తన పార్టీలోని చాలా మందిని సస్పెండ్‌ చేయబోతున్నాడని తెలిసి ఓ హోటల్‌లో ఎమ్మెల్యేలంతా కలుస్తారు. రాజకీయ తిరుగుబాటు చేస్తారు. ఈ సందర్భంగా నాయుడు.. రెడ్డికి ఫోన్‌ చేసి సలహా అడుగుతాడు. 

`ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేసినావ్. ఫ్రెండ్ గానా, ప్రత్యర్థి గానా? ఏం జరుగుతుంది నాయుడు?` అని రెడ్డి అడగ్గా `కురుక్షేత్రం. ఇది చావో రేవో అర్ధం కావడం లేదు రెడ్డి, 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు, స్నేహితుడి గా ఒక మాట చెప్పు. ఈ ఉచ్చు నుంచి బయటపడతానంటావా? అని నాయుడు అడిగ్గా.

నాయుడు నువ్వు గెలిస్తే వెన్నుపోటు బాణం వాడుతా అంటూ రెడ్డి హెచ్చరిక

`ఈరోజు నువ్వు గెలిస్తే... ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణం నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటాను` అని రెడ్డి అంటే `చివరికి పిల్లనిచ్చిన మామ తోనే ఉనికి కోసం పోరాడుతున్నాను. 

వేరే దారి లేదు` అని నాయుడు అనగా, `ఫ్రెండ్ గా ఒక మాట చెప్పనా నాయుడు, యుద్ధం నీ ధర్మం` అంటాడు రెడ్డి. దీంతో రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి.

అనంతరం `వ్యవసాయాన్ని మించిన చదువు లేదు పెద్దయ్య... మా అందరికన్నా పెద్ద చదువు నీదే` అని రెడ్డి, `డబ్బులతో కొనలేనిది ఒకటే ఒకటి ఉంది, ప్రజల మనసు` అని నాయుడు చెప్పడం, 

`మడక దున్నే కులంలో పుట్టిన వాడికి నీకెందుకు అబ్బే రాజకీయం` అని రెడ్డి అంటే, `వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీ వి నీకెందుకయ్యా వైద్యం` అని నాయుడు అంటారు. ఇద్దరు నవ్వుకుంటారు. 

`మాయసభ` టీజర్ లోని డైలాగులు బాగా కనెక్ట్ అవుతున్నాయి. గొప్ప స్నేహితుల కథగా ప్రారంభమై తరువాత రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరి వ్యక్తుల పయనం ఆసక్తికరంగా మారింది. 

టీజర్‌లోని ఇద్దరి పాత్రలు, వారి వేషాధారణ, మాట తీరుని, రాజకీయ జర్నీ ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ల జీవిత కథే అని స్పష్టమవుతుంది. అయితే టీమ్‌ మాత్రం పేర్లు మార్చడం విశేషం.

YouTube video player