ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సినీ నటుడు భరత్ భరత్ మాస్ మహారాజ్ రవితేజకు సొంత తమ్ముడు విగతజీవిగా మారిని తమ్మున్ని చూసి తట్టుకోలేక పోయిన రవితేజ ఆసుపత్రి నుంచి తిరిగి వెళ్తూ అంత్యక్రియలు చూసేందుకు వెళ్లలేనన్న రవితేజ

ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ హీరో రవితేజ తమ్ముడు, సినీ నటుడు భరత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఓఆర్ఆర్ పై కొత్వాల్ గూడ ప్రాంతంలో ఆగివున్న లారీని అతివేగంతో ఢీ కొట్టడం వల్ల భరత్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గత కొంత కాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా నివసిస్తున్న భరత్ తన లైఫ్ తాను లీడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా భరత్ ప్రయాణిస్తున్న కారు అతని తల్లి రాజ్యలక్ష్మి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో భరత్ ఒక్కడే ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.

ఇక భరత్ మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు తీసుకెళ్లేందుకు ఉస్మానియాకు వచ్చారు. ముఖ్యంగా భరత్ సోదరులు రవితేజ, రఘులు ఆసపత్రికి వచ్చినప్పటికీ.. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరిగిన అంత్య క్రియలకు మాత్రం రవితేజ హాజరు కాలేదు. సోదరుని అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన రవితేజ స్మశానం వరకు కూడా రాలేనని చెప్పి... దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

కాగా జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరిగిన భరత్ అంత్య క్రియలకు రవితేజ తల్లిదండ్రులు, సోదరుడు రఘుతోపాటు ఉత్తేజ్, జీవిత రాజశేఖర్, నటులు ఆలీ, రఘుబాబు, కుటుంబ సభ్యులు, పలువురు సమీప బంధువులు, మిత్రులు హాజరయ్యారు. అయితే సోదరుని మృతిని తట్టుకోలేకపోయిన రవితేజ స్మశానవాటికకు కూడా వచ్చి అంతిమ సంస్కారాల్లో పాల్గొని ఉంటే భరత్ ఆత్మ శాంతించేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా బతికున్నప్పుడు కొన్ని వివాదాల్లో చిక్కుకున్న భరత్ ఓ లారీ మూలంగా రోడ్డు ప్రమాదం జరిగి అకాల మరణం పొందటం సినీ పరిశ్రమకు చెందిన వారిని కలచి వేస్తోంది. 

మరోవైపు అసలు ప్రమాదానికి మద్యం మత్తులో ఉండటమే కారణమా లేక మరేమైనా కారణాలున్నాయా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి వుంది. అయితే కారులో వోడ్కా బాటిల్ లభ్యం కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇలాంటి ఘటనలు చూసైనా మద్యం తాగి వాహనాలు నడపడం మానుకుంటారని ఆశిస్తున్నాం.