మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తన కొడుకు నటించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు స్వయంగా భారీ బడ్జెట్ లో నిర్మించారు.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తన కొడుకు నటించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు స్వయంగా భారీ బడ్జెట్ లో నిర్మించారు. మైథాలజీ చిత్రం కావడంతో విజువల్స్ గ్రాండ్ గా ఉండడం కోసం బడ్జెట్ బాగా ఖర్చు చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మంచి విష్ణుకి హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించింది.
ఇటీవల మంచు విష్ణు, మనోజ్ మధ్య తీవ్రమైన విభేదాలు కారణంగా మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ కి.. తన తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణుతో తీవ్రమైన విభేదాలు మొదలయ్యాయి. కుటుంబ కలహాలు రచ్చకెక్కడం అంతా చూశారు. మీడియా ముందే ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. ఆస్తి విషయంలో విభేదాల వల్లే ఈ గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి..
అయితే మంచు మనోజ్ తన భైరవం చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది. అంతకుముందే కన్నప్ప చిత్రాన్ని ట్రోల్ చేస్తూ కూడా మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. కానీ తాజాగా విభేదాలన్నింటినీ పక్కనపెట్టి కన్నప్ప చిత్ర యూనిట్ కి మంచు మనోజ్ శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఇందులో ట్విస్ట్ ఉంది. మంచు విష్ణు పేరు తప్ప అందరి పేర్లు ప్రస్తావిస్తూ మంచు మనోజ్ కన్నప్ప చిత్రం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
కన్నప్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మంచు మనోజ్ కోరారు. మంచు మనోజ్ తన పోస్టులో.. కన్నప్ప చిత్రం యూనిట్ కి ఆల్ ది బెస్ట్. మా నాన్న, ఆయన టీం ఈ చిత్రం కోసం ఎన్నో ఏళ్ళు శ్రమించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించాలని ప్రార్థిస్తున్నా. లిటిల్ ఛాంపియన్స్ అరియానా, వివియానా, అవ్రామ్ సిల్వర్ స్క్రీన్ పై తమ తొలి మార్క్ ప్రదర్శించే క్షణం కోసం ఎదురు చూస్తున్నా. తనికెళ్ల భరణి గారి ఎన్నో ఏళ్ల కల రేపటితో సహకారం కాబోతోంది.
ఈ చిత్రంలో నటించి తమ సహకారం అందించిన గొప్ప మనసున్న ప్రభాస్ గారికి, అక్షయ్ కుమార్ గారికి, మోహన్ లాల్ గారికి ఇతర నటీనటులకు ధన్యవాదాలు. ఈ చిత్రానికి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నా అంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశారు.
ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన తన సోదరుడు మంచు విష్ణు పేరు మాత్రం ప్రస్తావించకుండా మంచు మనోజ్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ కి మంచు మనోజ్ కన్నప్ప మూవీ పోస్టర్లను కూడా జత చేశారు. కానీ మంచి విష్ణు ఉన్న ఒక్క పోస్టర్ని కూడా పోస్ట్ చేయలేదు.