వచ్చే ఎన్నికల్లో లోక్ సభ స్థానానికి మంచు లక్ష్మి పోటీ

First Published 31, Jan 2018, 12:23 PM IST
manchu lakshmi to contest for loksabha in 2019 elections
Highlights
  • వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లోకి మోహన్ బాబు వారసురాలు
  • కడప జిల్లా నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు రంగం సిద్దం
  • ఇప్పటికే సామాజిక సేవ, సినీ రంగాలతో జనాన్ని ఆకట్టుకున్న మంచు లక్ష్మి

విశ్వనట సార్వభౌమగా ఇటీవలే బిరుదాంకితులైన నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్  మోహాన్ బాబు రాజకీయ నేతలందరిలో తొంభైశాతం రాస్కల్స్ వున్నారంటూ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రాజకీయాల్లో మోహన్ బాబు చురుకైన పాత్ర పోషించారు. రాజ్య సభ సభ్యునిగానూ పదవిలో కొనసాగారు మోహన్ బాబు. అయితే.. ఒక్క టర్మ్ తోనే తనకు రాజకీయాల పట్ల ఆసక్తి పోయిందన్న మోహన్ బాబు ఆతర్వాత రాజకీయాలవైపు చూడలేదు. చంద్రబాబుతో మోహన్ బాబుకు పొసగలేదు. దానితో విసిగెత్తిన ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రాలేదు.  తెలంగాణ  ఉద్యమ సమయంలో సమైక్య రాష్ట్రానికి మద్దతుగా నిలిచిన మంచు కుటుంబం ఇప్పుడు మరోసారి రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సారి రాజకీయాలపై కన్నేసింది మాత్రం మోహన్ బాబు కాదు. గాయత్రి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న  ట్రైలర్ లో  ‘డైలాగ్ కింగ్ ’ అన్న పర్యాయ పదానికి మోహన్ బాబు కరెక్ట్ అనేలా డైలాగులు చెప్పి ఆకట్టుకున్నారు. చాలా పవర్ ఫుల్ డైలాగులతో.. పవర్ ఫుల్ ఎమోషన్స్ తో రూపొందించిన ట్రైలర్ లోనే సినిమాకు సంబంధించిన మేటర్ ఏ స్థాయిలో వుంటుందో చూపించారు. అయితే.. రాజకీయ పరంగా మోహన్ బాబుకు ఆసక్తి కనిపించకున్నా... ఆయన కుటుంబంలోంచి రాజకీయ వారసత్వం కోసం మంచు లక్ష్మి రెడీ అవుతోందని తెలుస్తోంది.

తెలుగు ప్రేక్షకులల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మంచు లక్ష్మి పలు సమాజజిక సేవా కార్యక్రమాలతోనూ, టీవీ షోలతోనూ, సినిమాలతోనూ.. ఇలా పలు రంగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ తనకంటూ ఓ క్లీన్ ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మంచు ఫ్యామిలీలో విష్ణు, మనోజ్ లు వున్నా... క్రేజ్ పరంగా మంచు లక్ష్మికే ఎక్కువ మార్కులు పడతాయి. అందుకే మంచు ఫ్యామిలీ నుంచి రాజకీయాలవైపు చూస్తున్నట్లుగా మంచు లక్ష్మి పేరు వినపడుతోంది.

మంచు లక్ష్మి కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చే ఎన్నికల్లో లోక్ సభ స్థానానికి పోటీ చేస్తారని ప్రాథమిక సమాచారం అందుతోంది. రాయలసీమ అంటే ప్రత్యేకమైన అభిమానం వున్న మోహన్ బాబు ఫ్యామిలీ గతంలో రాయలసీమ రామన్న చౌదరి, శ్రీ రాములయ్య లాంటి సినిమాలతో రాయలసీమ జనానికి దగ్గరయ్యారు. అందుకే రాయలసీమ జిల్లా కడపలోని రాజంపేట లోక్ సభ స్థానం నుంచి మంచు లక్ష్మి పోటీకి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్య సభ సీటు కోరటం కంటే ప్రజల అండదండలతో గెలవటానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మమోహన్ బాబు ఫ్యామిలీకి వైఎస్ జగన్ కుటుంబంతో బంధుత్వం కూడా వున్న సంగతి తెలిసిందే.  అన్ని కుదిరితే  ఆమె వైసిపి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

loader