నటి మంచు లక్ష్మీపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడం చూస్తూ ఉంటాం. ఆమెను ఇమిటేట్ చేస్తూ కొందరు ఔత్సాహికులు వీడియోలు కూడా చేస్తుంటారు. వీటిపై పెద్దగా స్పందించని మంచు లక్ష్మీ ఈసారి మాత్రం చాలా సీరియస్ అయింది. ప్రస్తుతం ఆమె నటించిన 'వైఫ్ ఆఫ్ రామ్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో తనపై వస్తోన్న నెగెటివ్ ట్రోలింగ్ పై ఫైర్  అయ్యారు. ''నా గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తుంటాయి. అవి నా దృష్టికి కూడా వస్తాయి. అయితే చాలా లైట్ తీసుకునేదాన్ని. నా మాట గురించి, నేను వేసే బట్టల గురించి అయితే పట్టించుకోను. కానీ నా పెర్సనల్ లైఫ్, అలానే నా కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడితే గనుక సహించేది లేదు. కొందరైతే ఫోటోలు మార్ఫింగ్ చేసి మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను  చెప్పుతో కొట్టాలనిపిస్తుంది.

అసలు నా గురించి, నా ఫ్యామిలీ గురించి ఏం తెలుసనీ మీరు ట్రోల్ చేస్తున్నారు. అంత ధైర్యం ఉంటె నా ముందుకు వచ్చి మాట్లాడండి. అంతేకానీ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు. నా కుటుంబం గురించి చౌకబారు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోను. చంపేయాలనే  కోపం వస్తుంది. మా నాన్న, తమ్ముళ్లు, నేను సినిమాలతో పాటు సమాజ సేవ కూడా చేస్తున్నాం. ఇతరులపై కామెంట్స్ చేసేప్పుడు ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.