ప్రముఖ మలయాళ సినీ నిర్మాత పీకేఆర్ పిళ్లై కుమారుడు, నటుడు సిద్ధు ఆర్ పిళ్లై గోవాలో శవమై కనిపించారు. ఆయన వయసు 27 సంవత్సరాలు. సిద్ధు మృతదేహాం గోవాలోని బీచ్‌లో సోమవారం లభ్యమైంది. జనవరి 12న ఆయన గోవాకు వెళ్లారు. అయితే ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోవడం వల్లే చనిపోయినట్టు ప్రత్యక్షంగా చూసిన కొంతమంది చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సిద్ధు స్వస్థలం త్రిశూర్‌లో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

సిద్ధు హఠాన్మరణంపై మలయాళ హీరో, మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ట్వీట్ చేశారు. ‘సిద్ధు ఆర్ పిళ్లై మృతి నన్ను ఎంతగానో బాధించింది. ఆయన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నా’ అని దుల్కర్ ట్వీట్ చేశాడు. దుల్కర్ సల్మాన్, సిద్ధు ఒకే సినిమాతో తమ సినీ కెరీర్‌ను ప్రారంభించారు.సెకండ్ షో’ సినిమా ద్వారా వీరిద్దరూ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో దుల్కర్ హీరోగా నటించగా.. శ్యామ్ అనే పాత్రలో సిద్ధు నటించాడు. ‘చిత్రం’, ‘వందనం’, ‘అమృతం గమయ’ తదితర 16 మలయాళ సినిమాల్లో సిద్ధు పలు పాత్రలు పోషించారు.