సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇదొక బ్రాండ్ అనే చెప్పాలి. 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా పరిచయమై సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన మహేశ్ నేడు 43వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సంధర్భంగా ఆయన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి. అదే ఆయన సినిమా ఫస్ట్ లుక్. దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేశ్ గడ్డం పెంచి సరికొత్త లుక్ తో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

కొన్నిరోజులుగా సినిమా టైటిల్ అంటూ ఆన్ లైన్ లో 'రిషి' అనే పేరు చక్కర్లు కొట్టింది. ఇది సినిమాలో మహేశ్ పేరా..?లేదంటే సినిమా టైటిలా..? అనే సందేహం నెలకొంది. దీన్ని పటాపంచలు చేస్తూ 'మహర్షి' అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. సింపుల్ షర్ట్ అండ్ జీన్స్ వేసుకొని గడ్డంతో ల్యాప్ టాప్ పట్టుకొని నడిచి వస్తున్న మహేశ్ లుక్ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. బ్యాక్ గ్రౌండ్ లో స్మార్ట్ సిటీ, పల్లెటూరు కనిపిస్తున్న దాని బట్టి ఇది రూరల్ అండ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అని తెలుస్తోంది.

ఈ సినిమా మహేశ్ కొంత సమయం పాటు స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.