సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో "ఊరు చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావయిపోతారు" అంటూ డైలాగ్‌లతో అలరించిన మహేష్ బాబు.. రియల్ లైఫ్‌లోనూ పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని తన సొంత ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకుని పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టారు మహేష్ బాబు. తాజాగా బుర్రిపాలెంలో మహేష్ బాబు సొంత ఖర్చులతో నిర్మించిన స్కూల్‌ ప్రారంభోత్సవం జరుపుకుంది. తన నాన్నమ్మ నాగరత్నమ్మ రాజాల పేరు మీద ఈ స్కూల్ కు నామకరణం చేసారు. 

ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు సతీసమేతంగా హాజరౌతారని ప్రచారం జరగినప్పటికీ ‘భరత్ అనే నేను’ మూవీ షూటింగ్‌ వల్ల మహేష్ బాబు హాజరుకాలేదు. దీంతో స్థానిక ఎమెల్యే చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన మహేష్ బాబు,కృష్ణ ఫ్యాన్స్ హాజరై హర్షం వ్యక్తం చేశారు. "ఎదుగుదల అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగడం".. అంటూ ‘శ్రీమంతుడు’ లో చెప్పిన డైలాగ్‌ని నిజ జీవితంలో మహేష్ చేసి చూపించారని ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా మహేష్ బుర్రిపాలెం గ్రామాన్నే కాకుండా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అక్కడ కూడా మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ పర్యవేక్షణలో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నారు. మొత్తానికి ‘సాటి మనిషి కష్టాన్ని చూడకపోతే మనం భూమ్మీద సంఘంలో బతకడం ఎందుకు?’ అన్న డైలాగ్‌ను నిజం చేసి చూపుతున్న రియల్ శ్రీమంతుడు మహేష్‌ కు హ్యాట్సాఫ్.