భరత్ అనే నేను మూవీ రివ్యూ... మహేష్ అదర గొట్టేశాడు

First Published 20, Apr 2018, 1:15 PM IST
Mahesh babu Bharath Ane nenu Movie Review
Highlights

సెల్యూట్ టు భరత్ అనే నేను

మహేష్ బాబు చాలా కాలం నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీమంతుడు వంటి ఇండస్ర్టీ హిట్ తర్వాత కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా భరత్ అనే నేను. 'భరత్ అనే నేను’ చిత్రం
ద్వారా బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు మన  ప్రిన్స్ మహేష్ బాబు. ‘త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళ్లను చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం’ చేస్తూ మరోసారి సొసైటీకి
మెసేజ్ ఇస్తున్నారు యంగ్ అండ్ స్టైలిష్ ముఖ్య‌మంత్రి మహేష్. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జోడీగా తెరకెక్కిన
‘భరత్ అనే నేను’ ఈ రోజు థియేటర్లలో సందడి మొదలైంది. మరీ భరత్ అనే నేను సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం! 

కథ: 
చిన్నతనంలోనే లండన్‌కు వెళ్ళి అక్కడే చదువు పూర్తి చేస్తాడు భరత్ . భరత్ తండ్రి రాఘవ(శరత్ కుమార్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సడన్‌గా రాఘవ మరణించడంతో లండన్ నుండి ఇండియాకు భరత్ వచ్చేస్తాడు. రాఘవ ప్రాణమిత్రుడు వరదరాజులు(ప్రకాష్ రాజ్), భరత్‌కు రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేకపోయినా.. పార్టీ రెండుగా చీలిపోకుండా ఉండడానికి అతడిని ముఖ్యమంత్రిని చేస్తారు. అలా ముఖ్యమంత్రి అయిన భరత్ తన భాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? తన సొంత పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయనే విషయాలను ఎలా జీర్ణించుకోగలిగాడు..? రాజకీయాలంటే ఏమీ తెలియని ఒక యువకుడు ముఖ్యమంత్రిగా తన బాధ్యతను ఎలా నిర్వర్తించాడు..? వసుమతితో ఈ యంగ్ సీఎం ప్రేమ ఏమవుతుంది..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే! 

విశ్లేషణ: 
 రాజకీయాలంటే ఏంటో కూడా తెలియని ఒక యువకుడు ఎనిమిది నెలల్లోనే ఎన్నో సేవలు చేస్తే.. రాజకీయంగా ఎంతో పండిపోయి ఉన్న మన నేతలు ప్రజలకు ఇంకెంత మంచి చేయొచ్చనే ఆలోచనను రేకెత్తించాడు. ట్రాఫిక్ ఇష్యూ.. అసలు ముఖ్యమంత్రి కాన్వాయ్ రోడ్ మీదకు వస్తే ట్రాఫిక్ అంతా ఎందుకు బ్లాక్ చేయాలనే సీన్‌ను చూపించడం నేటి పరిస్థితులకు అద్దం పడుతోంది. 

ఈ మధ్య కాలంలో మీడియా కూడా కొన్ని విషయాలను మరింత సాగదీసి కావాలని టీఆర్పీ రేటింగులు పెంచుకోవడం కోసం బలవంతంగా అడ్డమైన వార్తలతో ప్రజలపై రుద్దుతున్నారు. అలాంటివారిని టార్గెట్ చేస్తూ కొరటాల బలమైన సన్నివేశాలనే రాసారు. మహేష్ బాబు లాంటి హీరో ఇమేజ్‌ను ఎలివేట్ చేస్తూ మరోపక్క ఎంతో స్టైలిష్‌గా చూపించడంలో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. యంగ్ అండ్ స్టైలిష్ ముఖ్యమంత్రిగా తెరపై మహేష్ బాబు చక్కగా నటించాడు. యాక్షన్, ఎమోషన్, లవ్ ఇలా ప్రతి సీన్‌లో బాగా నటించాడు. ఫ్యామిలీలో ఉండే ఎమోషన్ ఎక్కడో.. ఈ సినిమాలో మిస్ అయిందనిపిస్తుంది. హీరోయిన్ కియారా అద్వానీ తెరపై పాటలకు రెండు మూడు సీన్లకే పరిమితమైంది. 

ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ వంటి నటులు తమ నటనతో పాత్రలకు న్యాయం చేశారు. అనవసరమైనవి ఏవీ సినిమాలో కనిపించవు. ప్రతిదీ కథలో భాగంగానే ఉంటుంది. 'భరత్ అనే నేను' టైటిల్ సాంగ్,  సినిమాకు ప్రాణం పోసింది. తెరపై ఆ పాట ఎన్నిసార్లు వస్తున్నా.. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఉంది. 'వచ్చాడయ్యో సామీ' పాటలో మహేష్ పంచెకట్టుతో చేసే డాన్స్ ఫ్యాన్స్ కు ఐఫీస్ట్. తిరు సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. సినిమా నిడివి మూడు గంటలకు దగ్గరగా ఉన్నా.. ఆడియన్స్ కు ఎక్కడా బోర్ అనిపించదు. కమర్షియల్ ఈ సినిమా ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి. 

ప్లస్ పాయింట్స్ : ఏదైనా సినిమా చూసామంటే ముందుగా ఏ సీన్ హైలైట్‌గా నిలిచిందో.. మాట్లాడుకుంటాం. ఈ సినిమాలో అటువంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ముందుగా మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేసే సీన్.. '' అని ఎప్పుడైతే అంటాడో.. దానికి తగ్గట్లు వెనక వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసింది. అంతఃకర్ణ శుద్ధితో అనే పదాన్ని చదవడానికి తడబడతాడు భరత్. అదే హైలైట్‌గా చేసి నెక్స్ట్ డే పేపర్‌లో అంతః కరణ శుద్ధిని సరిగ్గా ఉచ్చరించలేకపోయాడు. కనీసం అంతఃకర్ణ శుద్ధితో పనైనా.. చేస్తాడా..? అంటూ వార్తను ప్రచురిస్తారు. దానికి సమాధానం వచ్చే ఎపిసోడ్ బాగుంది. 

హీరోయిన్ వసుమతి(కియారా అద్వానీ)తో భరత్ ప్రేమాయణం సింపుల్‌గా ఉన్నా.. వినోదాత్మకంగా అనిపిస్తుంది. భరత్ చేసే మంచి పనులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు వరదరాజులు. అతడికి ఎదురుతిరిగి బాధ్యతను విస్మరించిన కొందరు నాయకులను దారిలో పెట్టే సన్నివేశాలతో ఇంటర్వల్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. ఇక సెకండ్ హాఫ్‌లో ఎప్పుడెప్పుడు భరత్‌ను కుర్చీలోనుండి దింపేద్దామా..? అని ఎదురుచూసే వారికి అతడి ప్రేమ ఒక సాకుగా కనిపిస్తుంది. తను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని తప్పుబడుతూ మీడియా రాసిన వార్తలను నిలదీస్తూ.. మీడియాను, కొందరు ప్రజలను టార్గెట్ చేస్తూ భరత్ ఇచ్చే స్పీచ్ మరో హైలైట్. తన తండ్రిది సాధారణమైన మరణం కాదని తెలుసుకున్న భరత్ దాన్ని ఛేదించే క్రమంలో అతడిని చంపాలని చూస్తారు. ఆ సమయంలో ప్రజలంతా భరత్‌కు అండగా నిలవడం మరో ప్లస్ పాయింట్. ఇలా సినిమాలో మహేష్ ఫ్యాన్స్‌ని సంతోషపరిచే సన్నివేశాలు బోలెడున్నాయి. 

ఓవరాల్ ఈ సినిమా అందరికి నచ్చేలా తీసిన కొరటాల నిడివి కొద్దిక ఎక్కువనిపించినా. మహేష్ మొత్తం సినిమాని తన భుజాన వేసుకొని నడిపించాడు. ఇది వన్ మ్యాన్ షో ఫ్యాన్స్ అన్ని విధాల నచ్చే సినిమా. ఈ సినిమాకి ఏషియానెట్ ఇచ్చే రేటింగ్ 3.

ఓవరాల్ రేటింగ్ : 3/5


 

loader