అలనాటి మేటి నటి సావిత్రి ఇప్పటికీ ఎందరికో ఆరాధ్య దేవత. ఇల్లాలు అనే పదానికి అర్థం ఆమేనా అన్నంతగా ముఖం కళకళలాడిపోతుంది. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం అన్నీ కష్టాలే. ఆమెకు ఇల్లాలు అన్న పదమే దక్కలేదు. ఎప్పుడు పెళ్లయ్యిందో కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆమె జీవిత కథతోనే మహానటి సినిమా రెడీ అవుతోంది. ఇందులో కీర్తి సురేస్ సావిత్రి పాత్రను పోషిస్తోంది. 

ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అయ్యింది. ముందు ప్రకటించిన ప్రకారం అయితే... మార్చి 30నే సినిమా విడుదలవ్వాలి. కానీ భారీగా చేయాల్సిన పనులు మిగిలే ఉన్నాయి. దీంతో విడుదల జూన్ లోనో...జూలై లోనో ప్లాన్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. కాగా కీర్తి సురేష్ సావిత్రి లుక్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తపడుతోంది చిత్ర యూనిట్. ఇదిగో ఇప్పుడు ఇలా ఒక పోస్టర్ లీకైంది. అందులో సావిత్రిగా కీర్తి సురేష్ ఎంతబాగా నప్పేసిందో. ఇంతవరకు ఆమెను సావిత్రి పాత్రకు ఎలా ఎంపికచేశారంటూ చాలా చోట్ల విమర్శలు వచ్చాయి. సీనియర్ నటి జమున కూడా కీర్తికి ఏం తెలుసని సావిత్రి పాత్ర చేస్తోందంటూ పబ్లిక్ గానే స్పందించారు. దానికి కీర్తి కూడా గట్టిగానే స్పందించింది. 

ఇప్పుడు లీకైన పోస్టర్ చూస్తే ఎవరికైనా ఆనాటి సావిత్రి గుర్తు రాక తప్పదు. ఆ క్రెడిట్ అంతా  మేకప్ ఆర్టిస్టుకే ఇవ్వాలి. కళ్లకు కాటుక బొట్టు హెయిర్ స్టైల్ అన్నీ సావిత్రిని అచ్చుగుద్దినట్టు దించేశాడు. ఆ చీరకట్టు కూడా ఎంత బాగా నప్పిందో. ఆ పోస్టర్లో పక్కన జెమిని గణేశన్ పాత్రలోని దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు. అతని మేకప్ కూడా అదిరింది. అచ్చు జెమినీనే గుర్తు తెస్తున్నాడు. ఈ పోస్టర్ చూశాక సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం.  కాని నిర్మాతలు మాత్రం.. అసలు ఎలా లీకైంది అంటూ తలపట్టుకుంటున్నారట.