కలెక్షన్స్ రికార్డు తమిళనాట సంచలనం సృష్టించి పలు వివాదాలకి కారణమైన మెర్సల్ చిత్రాన్ని నిషేధించాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన పిటిషన్‌ని చెన్నై హైకోర్టు కొట్టేసింది. మెర్సల్ అనేది కేవలం ఓ సినిమా మాత్రమే కానీ అదేమీ నిజ జీవితం కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది అందరికీ సమానంగానే వర్తిస్తుందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

 

మెర్సల్ పై..  చెన్నైకి చెందిన ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలోని వైద్య రంగం, కొత్తగా కేంద్రం అమలు చేసిన జీఎస్టీ వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యల ద్వారా మెర్సల్ సినిమా భారత దేశాన్ని తక్కువగా చేసి చూపిందని సదరు న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
 


ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాల్లో అదిరింది పేరిట వస్తోన్న ఈ సినిమా విడుదలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. తమిళనాట వివాదాలకి కారణమైన పలు డైలాగ్స్, సన్నివేశాలని తెలుగు వెర్షన్‌లో తొలగించినప్పటికీ.. ప్రస్తుతానికి ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా ఓ క్లారిటీ అయితే రాలేదు.

 

దాదాపు 700 థియేటర్లలో రిలీజ్ కావాల్సి వున్న ఈ సినిమా కోసం తెలుగు బయ్యర్స్ వేచిచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకుపైగానే వసూళ్లు రాబట్టిన తమిళ వెర్షన్ అక్కడి రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది.