హీరో రాజ్ తరుణ్ ఆ మధ్య లావణ్య అనే మహిళ విషయంలో వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మరోసారి ఆయనపై కేసు పెట్టింది లావణ్య.
హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు నమోదైంది. గతంలో తన ప్రియురాలు లావణ్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనని పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు తనతో ఉండి, ఆ తర్వాత హ్యాండిస్తున్నాడని, మరో హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని, తన వద్దకు రావడం లేదని, తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టింది. తనకు రాజ్ తరుణ్ కావాలని చెప్పింది. ఈ క్రమంలో తనపై దాడి చేశారంటూ ఆమె ఆరోపించింది. ఈ కేసు కోర్ట్ వరకు వెళ్లింది. రాజ్ తరుణ్, లావణ్యల మధ్య గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
రాజ్ తరుణ్‌పై మరోసారి కేసు పెట్టిన లావణ్య
ఇప్పుడు మరోసారి రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టింది లావణ్య. అయితే ఈ సారి రాజ్ తరుణ్ తమ కుటుంబ సభ్యులపై దాడి చేశాడని ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టింది. జూన్ 30న రాజ్ తరుణ్ తన అనుచరులతో కలిసి వచ్చి తమ ఫ్యామిలీ మెంబర్స్ పై దాడి చేశాడని, అలాగే బంగారం ఎత్తుకెళ్లాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ దాడిలో తన తండ్రి గాయాలపాలయ్యాడని వెల్లడించింది. అంతేకాదు తన పెంపుడు కుక్కని కూడా చంపారని ఫిర్యాదులో వెల్లడించింది లావణ్య.
పోలీస్ కమిషనర్ ఆదేశాలతో కేసు నమోదు
ఈ కేసు ఇన్నాళ్లని సీరియస్‌గా తీసుకోని పోలీసులు ఈ విషయం కాస్త సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు తాజాగా ఈ కేసుకి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారట. ప్రస్తుతం ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే రాజ్ తరుణ్, లావణ్యల మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో ఈ సారి ఈ కేసుని పోలీసులు కూడా కాస్త సీరియస్‌గానే తీసుకున్నట్టు సమాచారం. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. కాకపోతే రాజ్ తరుణ్‌ని మాత్రం లావణ్య ఇప్పట్లో వదిలేలా లేదని తెలుస్తోంది.
