ఎన్టీఆర్ ను,నన్ను అవమానిస్తున్నారు,అడ్డుకుంటా-లక్ష్మీపార్వతి

lakshmi parvathi washes ntr ghat with milk
Highlights

  • లక్ష్మీస్ వీరగ్రంథంపై లక్ష్మీపార్వతి ఆగ్రహం
  • ఎన్టీఆర్ ఘాట్ వద్ద పాలాభిషేకం చేసిన లక్ష్మిపార్వతి
  • అవమానిస్తే ఊరుకునేది లేదని కేతిరెడ్డికి హెచ్చరిక

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన దివంగత ముఖ్యమంత్రి అన్న నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా సినిమాలు తెరకెక్కించేందుకు పలువురు దర్శకనిర్మాతలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగానే.. ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కే బయోపిక్స్ వ్యవహారం రోజుకో సంచలనానికి తెరతీస్తోంది.

 

లక్ష్మీపార్వతి ప్రధాన పాత్రగా కేతిరెడ్డి జగదీశ్వర్ అనే దర్శకనిర్మాత తలపెట్టిన 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత ముఖ్యమంత్రి, అన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా తీయడం ముమ్మాటికీ ఎన్టీఆర్‌ను అవమానించడమేనని మండిపడ్డారు.

 

కావాలనే తనను అవమానించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నారని, ఎన్టీఆర్‌ను అగౌరపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన అనుమతి లేకుండా తన పేరు వాడుకొని సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు. అంతేకాక అసలు మహనీయుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా.. తనకు, ఎన్టీఆర్ కు నచ్చని పేరును తన పక్కన చేర్చి సినిమా టైటిల్ పెడితే.. చూస్తూ ఊరుకునేది లేదని, న్యాయపోరాటం చేస్తామని అవసరమైతే రోడ్ల మీదికి రావటానికి కూడా సిద్ధంగా వున్నామని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.

 

ఈ ఉదయం(మంగళవారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశారు. తనను, ఎన్టీఆర్‌ను అవమానించేలా, చరిత్రను వక్రీకరించి సినిమా తీయాలనుకుంటే అడ్డుకుంటామని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. కేతిరెడ్డి తోపాటు కొంతమంది పాపులు ఎన్టీఆర్ ఘాట్‌ను అపవిత్రం చేశారని ఆరోపించిన ఆమె అందుకే పాలాభిషేకంతో శుద్ధి చేశామని చెప్పారు.

 

‘లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా ముహూర్తపు షాట్‌ను ఎన్టీఆర్ ఘాట్ వద్ద తీసేందుకు కేతిరెడ్డి ప్రయత్నించగా.. లక్ష్మీపార్వతి బంజారాహిల్స్‌ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షూటింగ్ అడ్డుకున్నారు.

 

అసలు ఎన్టీఆర్ కు అన్యాయం జరిగిందనే అంశంపై ఏళ్లతరబడి  పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి ఆయన భార్యనైన లక్ష్మిపార్వతినే అన్నారామె. ఎన్టీఆర్ ను రెండడో పెళ్లి చేసుకోవడమే తప్పంటే.. ఆయన కుటుంబంలో కూడా అలా జరుగుతున్నాయని, అసలు లోకంమీద రెండో పెళ్లిళ్లకు చోటులేదనే ధైర్యం వీళ్లకుందా అని ప్రశ్నించారామె. అసలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద సినిమా షూటింగ్ చేయడం ఆయన ఆత్మకు ఘోష కలిగించటమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు లక్ష్మీపార్వతి.

loader