సీనియర్ టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాసరావు ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కోటా తన స్వగృహంలోనే మరణించారు. 

Kota Srinivasa Rao Passes Away : టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (83) ఇక లేరు. అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థత తో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు. పెద్ద వయసు కావడం, వృద్ధాప్య సమస్యలతో కోటా బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన నడవడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. కోటా శ్రీనివాసరావు నటించిన చివరి సినిమా 2023లో రిలీజైన సువర్ణ సుందరి.

దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు కోటా శ్రీనివాసరావు. కెరీర్ మొత్తంలో 750 కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. కోటా శ్రీనివాసరావు మరణంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మృతితో సినీపరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు.

కృష్ణా జిల్లా కృష్ణాజిల్లా కంకిపాడులో 1942 జూలై 10 న జన్మించారు కోటా శ్రీనివాసరావు.ఆయన తండ్రి సీతారామాంజనేయులు ఆయుర్వేద డాక్టర్. కోటాను ఆయన తండ్రి బాగా చదివించారు. డాక్టర్ కావాలి అనుకున్న కోటా శ్రీనివాసరావుకు డిగ్రీ అయిపోగానే బ్యాంక్ లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అప్పటికే నాటకాల్లో అడుగుపెట్టిన ఆయనకు నటన రుచి తెలియడంతో ఉద్యోగానికి సెలవులు పెట్టి మరీ నాటకాలు వేసేవారు. ఇక సినిమా అవకాశాలు కూడా రావడంతో వెండితెరపై బిజీ అయ్యారు, అటు ఉద్యోగం, ఇటు సినిమాలు రెండింటిని చూసుకోలేక.. సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాన్నే వదిలేసుకున్నారు కోటా శ్రీనివాసరావు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో ఆయన నటించారు.

కోటా శ్రీనివాసరావుకు భార్య రుక్మీణి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక కోటా తమ్ముడు శంకర్ రావు కూడా టాలీవుడ్ నటుడిగా కొనసాగుతున్నారు. నటన మాత్రమే కాదు కోటా శ్రీనివాస్ రాజకీయాల్లో కూడా రాణించారు. 1999 నుంచి 2004 వరకు ఆయన విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు.