ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా సతీమణి నేహా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నటీమణులను వేశ్యలతో పోలుస్తూ మాట్లాడారు. వారు పచ్చని సంసారాన్ని కూల్చే వారని ఆరోపించారు. ఆమె చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే తను అందరు హీరోయిన్లను ఉద్దేశించి ఇలా మాట్లాడలేదని, కొందరికి మాత్రమే ఇది వర్తిస్తుందని నేహా చెప్పారు. అంతేకాదు త్వరలోనే వారి పేర్లను బయటపెడుతానని ఆమె వెల్లడించారు.
ఈ మేరకు నేహా ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘మౌనంగా ఉండాలా? లేదా తుపానులా విజృంభించాలా?.. నేను రెండోది ఎంచుకున్నాను’ అని ట్వీట్‌ చేశారు. మహిళలే.. మహిళలకు శత్రువులు అవుతున్నారని అభిప్రాయపడ్డారు. తప్పుడు దారిలో నడుస్తూ.. ఆనందంగా జీవిస్తున్న కుటుంబంలో కలహాలు సృష్టించే ఇలాంటి వారిని శిక్షించాలని పేర్కొన్నారు.
ఇంటిలో భర్తను నియంత్రించడం భార్య బాధ్యతని.. ఇదే సూత్రం భార్యలకు కూడా వర్తిస్తుందని ఆమె తెలిపారు. బరితెగించిన భార్యను నియంత్రించాల్సిన బాధ్యత కూడా భర్తకు ఉందన్నారు. ఇలాంటి మహిళల్ని పబ్లిక్‌లో కొడతానని ఆమె అన్నారు. బహిరంగంగా హెచ్చరిస్తున్నానని, వీరిని వదలకూడదని చెప్పారు. త్వరలో వీరి పేర్లను కూడా బయటపెడతానని ఆమె పేర్కొన్నారు.
 
కొంతసేపటికి నేహా తన ట్వీట్లు డిలీట్‌ చేసి.. మళ్లీ కొత్త ట్వీట్‌ చేశారు. ‘కొన్ని సున్నితమైన విషయాలు వినోదానికి సరికావు. నేను చేసిన పోస్ట్‌ నా సొంత సమస్య కాదు, నా భర్తతో నాకు ఎటువంటి సమస్యలు లేవు. నా చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఇవి.. వారిని ఉద్దేశిస్తూ నేను మాట్లాడాను. పెళ్లి చేసుకున్న పురుషుల జీవితాల్లోకి కొందరు మహిళలు ప్రవేశిస్తున్నారు. ప్రచారం కోసం నేను ఈ ట్వీట్లు చేయలేదు. సోషల్‌మీడియా చాలా శక్తిమంతమైన మాధ్యమం.. అందుకే దీన్ని ఎంచుకున్నా. కానీ దీని వల్ల విమర్శలు వస్తున్నాయి. అందుకే పాత ట్వీట్లు డిలీట్‌ చేశా. దయచేసి బాధ్యతగా మద్దతు తెలుపండి’ అని ఆమె పేర్కొన్నారు.
జ్ఞానవేల్‌ రాజా అనేక హిట్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘గ్యాంగ్‌’, ‘సింగం 3’ తదితర చిత్రాలకు ఆయనే నిర్మాత. నేహా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ‘సింగం 3’ సినిమాకు ఆమె డిజైనర్‌గా పనిచేశారు.