దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఖుష్బూ అంటే తెలియనివారుండరు. ఇక తమిళనాడులో అయితే ఖుష్బూది పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన ఖుష్బూకు.. అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళనాడు రాష్ట్రంలో ఆమెకు గుడి కట్టి మరీ ఆరాధించిన అభిమానులున్నారంటే ఖుష్బూ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఖుష్బూ కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉంది.

 

ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో అంత బిజీగా వున్నా... ఆమె ఓ వ్యక్తిని కలవడానికి 33 ఏళ్లు నిరీక్షించిందట. ఇంతకీ ఎవరా వ్యక్తి అని అనుకుంటున్నారా? టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి. తన చిన్ననాటి అభిమాన క్రికెటర్‌, ప్రస్తుత టీమ్‌ ఇండియా కోచ్‌ రవిశాస్త్రితో కలిసి తీసుకున్న సెల్ఫీలను ట్విటర్‌లో పోస్ట్ చేసింది ఖుష్బూ. ఈ సందర్భంగా.. ‘నా కల నిజమైంది. చివరికి నా హీరో రవిశాస్త్రిని కలుసుకున్నా. నిరీక్షణ ఫలించింది. ఆయన్ని కలవడానికి 33 ఏళ్లు ఎదురుచూశా' అని ఖుష్బూ ట్వీట్ చేసింది.

 

ఖుష్బూ ప్రస్తుతం పవర్‌స్టార్‌ కళ్యాణ్ 25వ చిత్రంలో నటిస్తోంది. 2006లో ‘స్టాలిన్‌' తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయెల్‌ పవన్ సరసన నటిస్తున్నారు. ఖుష్బూ ఈ మూవీలో  పవన్‌ కళ్యాణ్ అత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి బయటకు వచ్చి వైరల్ అయింది.