ఏక్ థా టైగర్ సినిమా తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా తాజాగా వస్తున్న చిత్రం ‘టైగర్‌ జిందా హై’.  ఈ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా కత్రినా, సల్మాన్‌ ‘డ్యాన్స్‌ ఛాంపియన్స్‌’ అనే రియాల్టీ షోలో న్యాయనిర్ణేతలుగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. అయితే కత్రినాను నవ్వించడానికి సల్మాన్‌ ఖాన్‌ చేసిన ప్రయత్నం నెటిజన్లనే కాదు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. సల్మాన్‌ డ్యాన్స్‌ షోకి వచ్చిన సందర్భంగా ఓ జట్టు ఆయన నటించిన ‘తేరే నామ్‌’ చిత్రంలోని టైటిల్‌ పాటకు డ్యాన్స్‌ చేశారు.

 

ఈ పాటకు వారు చేసిన డ్యాన్స్‌ చూసి కత్రినా కంట తడి పెట్టారు. దాంతో షో నిర్వాహకులు కొద్దిసేపటి వరకు చిత్రీకరణ నిలిపివేశారు. ఆ తర్వాత సల్మాన్‌ కత్రినాను నవ్వించడానికి ఆయన నటించిన ‘సుల్తాన్‌’ చిత్రంలోని ‘జగ్‌ ఘూమెయా..’ అనే పాటకు డ్యాన్స్‌ చేశారు.

 

ఆ డ్యాన్స్‌ చూసి కత్రినా నవ్వేశారు. అంతేకాదు సల్మాన్‌తో కలిసి ‘మైనే ప్యార్‌ కియా’ చిత్రంలోని ‘దిల్‌ దీవానా’ అనే పాటకు డ్యాన్స్‌ కూడా చేశారు. వీరిద్దరి డ్యాన్స్‌ చూసి అక్కడున్నవారంతా ఈలలు వేస్తూ చప్పట్లు కొట్టారు.