తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నిన్న సాయంత్రం ఆనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన మరణం రాజకీయాలకు తీరని లోటు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన మంచి కవి. సినిమాలకు కూడా రచయితగా కొన్నేళ్లపాటు పని చేశారు. ఎన్నో చిత్రాలకు స్క్రీన్ ప్లే కూడా అందించి తన సత్తా చాటుకున్నారు. తెలుగు సినిమాలకు కూడా ఆయన పని చేయడం విశేషం.

రాజకీయాల పరంగా ఆయన ఎంత బిజీగా ఉన్నా.. సినిమా ఫంక్షన్ కి పిలిస్తే తప్పకుండా హాజరయ్యేవారు. దివంగత నిర్మాత రామానాయుడు 1971లో నిర్మించిన 'ప్రేమనగర్' సినిమా వంద రోజుల ఫంక్షన్ కి కరుణానిధి హాజరయ్యి చిత్రబృందానికి జ్ఞాపికలు అందజేశారు. అలాగే దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'నీడ' సినిమా వంద రోజుల కార్యక్రమానికి కూడా కరుణానిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హీరో కృష్ణ నటించిన 'అమ్మాయి మొగుడు-మామకు యముడు' సినిమాకు కరుణానిధి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. 1980లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో రూపొందిన 'వండిక్కారన్  మగన్' సినిమాకు ఇది రీమేక్. తమిళ చిత్రాలకి రచయితగా పని చేసిన ఆయన తెలుగు సినిమాలకు కథనం అందించడం విశేషం.