తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనారోగ్యంతో నిన్న సాయంత్రం మృతి చెందారు. ఆయన మరణవార్త విని తమిళ ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కరుణానిధికి, సూపర్ స్టార్ రజినీకాంత్ కి మధ్య మంచి సంబంధాలున్నాయి. వీరిద్దరూ ఒక వేదికపైకి వచ్చారంటే.. సీరియస్ పంచ్ లు పడుతుండేవి.

అలాంటి ఓ సంఘటన గుర్తు చేసుకుంటే.. చెన్నైలో జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో రజినీకాంత్, కరుణానిధి పాల్గొన్నారు. ముందుగా మైక్ తీసుకొని మాట్లాడిన రజినీకాంత్ రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ.. 'రాజకీయ నాయకులంటే నిప్పు లాంటివారు.. వారు మనకు ఎంత సన్నిహితులైనా సరే ఆ నిప్పుల సెగ తగలకుండా జాగ్రత్తగా ఉండాలి' అన్నారు. దానికి కరుణానిధి.. 'తమ్ముడూ నేను అవినీతికి మాత్రమే నిప్పులాంటివాడిని.. కానీ సేవలో ప్రజల కాలి చెప్పులాంటివాడిని' అంటూ రజినీకాంత్ కి కౌంటర్ పంచ్ ఇచ్చారు. ఆయన డైలాగ్ తో అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు.