Asianet News TeluguAsianet News Telugu

ఖాకీ మూవీ రివ్యూ రేటింగ్

  • చిత్రం: ఖాకీ
  • నటీనటులు : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, జమీల్ ఖాన్ తదితరులు
  • సంగీతం : గిబ్రాన్
  • దర్శకత్వం : హెచ్ వినోద్
  • నిర్మాత : ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్.ఆర్ 
  • ఆసియానెట్ రేటింగ్ : 2.75/5        
karthi rakul khaaki movie review

తెలుగులో మంచి ఫాలోయింగ్ వున్న తమిళహీరోల్లో సూర్య సోదరుడు కార్తీ కూడా ఒకరు. తన విభిన్నమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ఆయన నటించిన ‘ఊపిరి’ సినిమా తెలుగులో ఘన విజయాన్ని సాధించింది. తాజాగా తను నటించిన తమిళ సినిమా ‘ధీరన్ అధిగారం ఒండ్రు’ అనే చిత్రాన్ని ‘ఖాకీ’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. వివరాలు సమీక్షలో తెలుసుకుందాం! 

కథ:
 
ధీరజ్(కార్తి) పోలీస్ ట్రైనింగ్ తరువాత తమిళనాడులో ఓ ప్రాంతంలో డీఎస్పీగా చార్జ్ తీసుకుంటాడు. అప్పటికే ప్రియా(రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ భార్యను ప్రేమగా చూసుకునే ధీరజ్ జీవితాన్ని ఓ కేసు మలుపు తిప్పుతుంది. కొందరు వ్యక్తులు డబ్బు కోసం ఇళ్లలోకి చొరబడి అతి క్రూరంగా అందరినీ చంపేస్తుంటారు. ఈ కేసుని పరిష్కరించాలని సొంతంగా నిర్ణయించుకుంటాడు ధీరజ్. వేలిముద్రల సహాయంతో వాళ్లను పట్టుకోవాలనుకుంటాడు. కానీ అతడికి ఒక్క క్లూ కూడా దొరకదు. 

ఈ క్రమంలో దొంగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి ఆయన్ని చంపేస్తారు. ఇక పోలీస్ యంత్రాంగం ఇండియా మొత్తం వెతికి వాళ్లను కనిపెట్టాలనుకుంటుంది. ఈ బాధ్యతను ధీరజ్‌కు అప్పగిస్తుంది. ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఓ క్రిమినల్ వేలిముద్రలతో ఎమ్మెల్యేను హత్య చేసిన ఘటనా స్థలంలో వేలిముద్రలు మ్యాచ్ అవుతాయి. దీంతో ఆ క్రిమినల్‌ను పట్టుకోవడానికి ధీరజ్ బయలుదేరతాడు. మరి అనుకున్నట్లుగా క్రిమినల్స్‌ను పట్టుకోగలిగాడా..? ఈ కేసు కారణంగా ధీరజ్ ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నాడు..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే! 

విశ్లేషణ: 
నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఒక కేసును ఛేదించే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆ కేసు కారణంగా తన జీవితం ఎలా మారి పోయిందనే విషయాలతో దర్శకుడు వినోద్ ‘ఖాకీ’ కథను సిద్ధం చేసుకున్నాడు. పోలీస్ కథలతో చాలా చిత్రాలు వచ్చినప్పటికీ కార్తి ‘ఖాకీ’ మాత్రం కొత్తగా ఉందనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో క్రిమినల్స్ కోసం పోలీసులు వెతకడం, వాళ్లు చిక్కినట్లే చిక్కి చేజారిపోవడం వంటి విషయాలతో నడుస్తుంది. ఇంటర్వల్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం రేసీ స్క్రీన్‌ప్లే‌తో సాగింది. కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కలిగినప్పటికీ ఓవరాల్‌గా సినిమా ఆడియన్స్‌ ను మెప్పిస్తుంది. 

 

నటీనటులు:

తెలివైన పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌ లో కూడా కార్తి పరిణితి కనబరిచాడు. రకుల్ ప్రీత్ సింగ్‌కు డీసెంట్ రోల్ దక్కింది. తన నటనతో మెప్పించింది. అభిమన్యు సింగ్ విలన్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సినిమా మొత్తం కార్తి, క్రిమినల్స్ చుట్టూనే తిరుగుతుంటుంది. ఫాస్ట్ స్క్రీన్‌ప్లే‌తో ఆడియన్స్‌ ను కట్టిపడేసే ప్రయత్నం చేశారు.

 

సాంకేతిక నిపుణులు:

టెక్నికల్‌గా కూడా సినిమా మంచి క్వాలిటీతో రూపొందించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఆకట్టుకుంటుంది. కెమెరా పనితనం మెప్పిస్తుంది. పాటలు కథలో భాగంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది.

చివరగా:

కార్తి.. తన ‘ఖాకీ’ చిత్రంతో మరోసారి తెలుగు వారిని మెప్పించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios