ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించిన చాలా విషయాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. సినిమా హీరోని ఒక వర్గానికి చెందిన యువకుడిగా చూపించినా.. కథ ప్రకారం ఏ కులంపైనైనా కామెంట్స్ చేసినా అది కాస్త పెద్ద దుమారానికి తెరలేపుతుంది. డిజె సినిమా సమయంలో కూడా అల్లు అర్జున్ ని బ్రాహ్మణుడిగా చూపించే విషయంలో కొన్ని వివాదాలను ఎదుర్కొన్నాడు దర్శకుడు హరీష్ శంకర్.

ఇలాంటి ఉదాహరణలు మరెన్నో.. అయితే తాజాగా స్టార్ హీరో కమల్ హాసన్ సినిమా టైటిల్ మార్చమని ఆయనను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన 'శభాష్ నాయుడు' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఈ సినిమా టైటిల్ లో నాయుడు అనే కులం పేరు ఉందని కాబట్టి దాన్ని లేకుండా టైటిల్ మార్చాలని కమల్ ను కొందరు బెదిరిస్తున్నట్లు సమాచారం.

తమిళ, తెలుగు భాషల్లో 'శభాష్ నాయుడు' అనే పేరుతోనే ఈ సినిమా విడుదలవుతోంది. అయితే తమిళనాట టైటిల్ వివాదం లేవనెత్తినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రూప్ లు అయితే టైటిల్ మార్చాల్సిందే లేదంటే సినిమాను అడ్డుకుంటామని కుల సంఘాలతో కలిసి కమల్ ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారట. కానీ కమల్ మాత్రం టైటిల్ మార్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశాడట. మరి ఈ టైటిల్ రచ్చపై ఇంకెంత వివాదం చెలరేగుతుందో చూడాలి!