నందమూరి కుటుంబం...మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో..  కలిసి సినిమా చేస్తే.. ఇక అవి రికర్డులు మోతే అనాలి . వసూళ్ల వరద పారాల్సిందే. ఇప్పటికే ఎన్టీఆర్ - రాంచరణ్ కలిసి ఓ  మల్టీస్టారర్ కి బీజం వేశారు. ఇలాంటిదే మరో ప్రాజెక్టు గురించి కూడా చాలానే వార్తలు వచ్చాయి. 

ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్.. సాయి ధరమ్ తేజ్ లు కలిసి ఓ సినిమా చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఇలా కలిసి నటించేందుకు వీరిద్దరూ సంసిద్ధత వ్యక్తం చేసినా.. స్క్రిప్ట్ నచ్చకపోవడంతో అది సాకారం కాలేదు. ఇప్పుడు మరో దర్శకుడు ఈ డ్రీమ్ సాకారం చేయనున్నాడట. ఈ విషయాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. తేజుతో సినిమా చేసేందుకు ఉత్సాహంగానే ఉన్నా స్క్రిప్ట్ సహకరించలేదన్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు మరో మల్టీ స్టారర్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. అందులో తాను ఓ హీరో అనే విషయాన్ని చెప్పేశాడు. 

పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు నందమూరి కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు హీరోలు నటించనుండగా.. మరో హీరో పాత్రను ఓ క్రేజీ యంగ్ హీరో చేయనున్నాడట. ఆ రోల్ లో ఎవరు నటిస్తారనే అంశాన్ని.. మల్టీస్టారర్ కు దర్శకుడి పేరుపై కానీ కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఇది కచ్చితంగా మెగా నందమూరి మల్టీస్టారర్ అనే టాక్ వినిపిస్తోంది.