సోషల్ మీడియాతో ఉన్న లాభాలెంతో.. నష్టాలూ అంతే. ఏ సమాచారమైనా క్షణాల్లో జనాలకు చేరవేయడంలో.. ఏ అంశాన్నయినా చర్చనీయాంశం చేయడంలో సోషల్ మీడియాను మించిన మార్గం మరొకటి లేదు. ఐతే సమాచారం త్వరగా పంచుకోవాలనే ఆతృతలో అది నిజమా కాదా అని సరిచూసుకోకపోవడంతో పలుమార్లు గందరగోళ పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఈ తరహాలో చాలామంది ప్రముఖుల్ని బతికుండగానే చంపేస్తుంటారు సోషల్ మీడియా యూజర్లు. నిన్న అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. తెలుగు సినిమా దిగ్గజ నటుల్లో ఒకరైన కైకాల సత్యనారాయణ చనిపోయారంటూ నిన్న సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయి.

సత్యనారాయణ ఫొటో పెట్టి చాలామంది ‘రిప్’ మెసేజులు జోడించేశారు. కానీ తీరా తేలిందేమంటే చనిపోయింది కైకాల సత్యనారాయణ కాదు. వంకాయల సత్యనారాయణ అని. కైకాల తరానికే చెందిన వంకాయల క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ మోస్తరుగా పేరు సంపాదించాడు. 180 దాకా సినిమాలతో పాటు సీరియళ్లలో కూడా నటించారు. ఐతే ఆయన కొన్నేళ్లుగా లైమ్ లైట్లో లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంకాయల నిన్న తుది శ్వాస విడిచారు. ఐతే చనిపోయింది వంకాయల అని గుర్తించకుండా కొందరు కైకాల సత్యనారాయణ తుది శ్వాస విడిచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అలా బతికుండగానే మరో మరో ప్రముఖుడు సోషల్ మీడియా వరకు చనిపోయాడు. ఈ ప్రచారం పెద్దది కావడంతో కైకాల సన్నిహితులు ఆయనకేమీ కాలేదంటూ వివరణ ఇచ్చారు.