రివ్యూ: కాశి

kaasi telugu movie review
Highlights

'బిచ్చగాడు' ఘన విజయంతో తెలుగునాట పాపులర్ అయిన విజయ్ ఆంటోనీ ఈసారి

నటీనటులు: విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్
ఎడిటర్: లారెన్స్ కిషోర్
నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి
రచన-దర్శకత్వం: కిరుతిగ ఉదయనిధి
నిడివి: 1౩౩ నిమిషాలు 

'బిచ్చగాడు' ఘన విజయంతో తెలుగునాట పాపులర్ అయిన విజయ్ ఆంటోనీ ఈసారి 'కాశి'గా మన ముందుకొచ్చాడు. ఆసక్తికర అంశాలను ఎంచుకోవడంలో స్పెషలిస్ట్ అయిన విజయ్ అంటోనీ ఈసారి ఎలాంటి కథను ఎన్నుకున్నాడో చెప్పడానికి ముందుగానే ఏడు నిమిషాల సినిమాను రిలీజ్ చేసి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో తెలుసుకుందాం!

కథలోకి వెళ్తే.. భరత్(విజయ్ ఆంటోనీ) అమెరికాలో భరత్ మల్టీనేషనల్ హాస్పిటల్ కు అధినేత. తల్లితండ్రులతో కలిసి అమెరికాలో ఉంటూ డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ హుందాగా బ్రతికే భరత్ ను చిన్నప్పటినుండి ఒక కల వెంటాడుతుంటుంది. అందులో ఎద్దు తనను పొడవబోతే ఎవరో అడ్డుకుంటారు అలానే పెద్ద పాము కూడా కనిపిస్తుంది. ప్రతి రోజు అదే కల ఎందుకు వస్తుందో భరత్ కు అర్ధం కాదు. ఇది ఇలా ఉండగా భరత్ తల్లితండ్రులమని చెబుతున్న వారు అతడిని కన్నవారు కాదని భరత్ కు తెలుస్తుంది. దీంతో భరత్ కు వస్తోన్న కలకు తన చిన్నతనానికి ఏదైనా లింక్ ఉందేమో తెలుసుకోవాలని ఇండియాకు వస్తాడు. తన కన్నతల్లి పార్వతిని వెతుక్కుంటూ వెళ్తాడు. చిన్నప్పుడే తనను ఎద్దు పొడవబోతే తనను కాపాడి ఆమె చనిపోయిందని భరత్ తెలుసుకుంటాడు. తన తల్లి ఏ దిక్కూ లేకుండా చనిపోవడానికి కారణం ఏంటి..? తన తండ్రి ఎక్కడున్నాడనే విషయాలను తెలుసుకోవడానికి భరత్ ఒక గ్రామానికి వెళ్తాడు. మరి భరత్ కు తన అసలైన తండ్రి ఎవరనే విషయం తెలుస్తుందా..? ఆ తరువాత ఏం చేశాడు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

 
కళాకారులపనితీరు: 
టెక్నికల్ గా విజయ్ ఆంటోనీకు పేరు పెట్టడానికి ఏం లేదు. కానీ నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి చాలా తపన పడుతున్నాడు. సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో ఎంతకాలం నెట్టుకురాగలుగుతాడు. అందుకే కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. కథలో కొత్తదనం ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకం. అయితే ఈసారి అది వర్కవుట్ కాకపోవడంతో నటుడిగా విజయ్ చేసిన పొరపాట్లు తెరపై కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. సినిమాలో మొత్తం నాలుగు గెటప్స్ (భరత్, కాట్రాజు, రత్తయ్య, చర్చ్ ఫాదర్)లో దర్శనమిస్తాడు. కానీ ఏ ఒక్కపాత్ర కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వదు. రత్తయ్య పాత్రకు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. చర్చ్ ఫాదర్ గా విజయ్ అసలు సెట్ కాలేదు. భరత్ పాత్రలో సింపుల్ లుక్ తో బాగానే అనిపించాడు. అయితే పాత్రలను డిజైన్ చేసిన తీరు మాత్రం ఆకట్టుకోదు. తెరపై అన్ని గెటప్స్ లో విజయ్ ను చూడడం కష్టంగా అనిపిస్తుంది. ఒక్కో పాత్రకు ఒక్కో హీరోయిన్ అన్నట్లు మొత్తం నలుగురు హీరోయిన్లు కనిపిస్తారు. వారి పాత్రలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంజలి రోల్ గురించి మాట్లాడుకోకపోవడం మంచిది. అమృత అయ్యర్ లుక్స్ పరంగా ఆకట్టుకుంటుంది. శిల్పా మంజునాథ్ కట్టు, బొట్టులో తమిళ నేటివిటీ నిండిపోయింది. సునైన పాత్ర నాలుగైదు సన్నివేశాలకే పరిమితమైంది. తెరపై ఈ పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. మిగిలిన పాత్రధారులు తమ నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. 


సాంకేతికవర్గం పనితీరు: 
దర్శకురాలు టైం వేస్ట్ చేయకుండా కథ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చెప్పడం మొదలుపెట్టింది. కథను ఆరంభించిన పాయింట్ బాగున్నా కానీ, ఎగ్జిక్యూషన్ దెబ్బకొట్టింది. కథ మొదలైన కొద్దినిమిషాలకే పాత్రలన్నీ సడెన్ గా కథలోకి ప్రవేశిస్తుంటాయి. దానివల్ల ఆడియన్స్ కథతో కనెక్ట్ అయినా కానీ క్యారెక్టర్స్ ను రిలేట్ చేసుకునే వీలుండదు. హీరో తండ్రిని వెతుక్కుంటూ వెళ్తే.. అది చూపించడం మానేసి ఉపకథలకు ప్రాధాన్యమివ్వడం అర్ధం కాదు. కథను రాయడంలోనే కాదు తెరపై ఆవిష్కరించడంలో కూడా డైరెక్టర్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. విజయ్ ఆంటోనీ అందించిన సంగీతం బాగానే ఉన్నప్పటికీ అందులో తెలుగు సాహిత్యం మాత్రం అసలు ఆకట్టుకోదు. కనీసం అమ్మ గొప్పతనాన్ని చెప్పే పాట విషయంలోనైనా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నేపథ్య సంగీతం బాగుంది. రిచర్డ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా క్వాలిటీతో సినిమాను నిర్మించారు. 

విశ్లేషణ: 
హీరో పోషించే నాలుగు గెటప్ లు దానికి తగ్గట్లు నాలుగు స్టోరీలు.... ఎలాంటి కొత్తదనం లేని ఆ ఉపకథలతో సినిమాను నడిపించారు. నిజానికి విజయ్ ఆంటోనీ చాలా లిమిటెడ్ టాలెంట్ ఉన్న యాక్టర్. అలాంటి హీరో ఉన్నప్పుడు కథ రెండింతలు బలంగా ఉండాలి. లేదంటే హీరో తేలిపోవడమే కాక సినిమా రిజల్ట్ కూడా అంతే అవుతుంది. ఇప్పటివరకు కథల విషయంలో చాలా జాగ్రత్త వహించిన విజయ్ మరి ఈసారి దేనికో లైట్ తీసుకున్నట్లుఉన్నాడు. అతడు నటించిన భేతాళుడు, ఇంద్రసేన హిట్ సినిమాలు కాకపోయినా వాటి ద్వారా ఏదో కొత్త విషయం చెప్పాలనుకున్నాడు. కానీ ఈసారి ఏదీ లేదు. సినిమాలో తెలుగువారికి దగ్గరైన నటీనటులు లేకపోవడంతో తెరపై కాశి డల్ అయిపోయాడు. తెర వెనుక నుండి మాత్రం మంచి సహకారమే అందుకున్నాడు. అదే కాస్తో కూస్తో సినిమాకు ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ లో గానీ, సెకండ్ హాఫ్ లో గానీ చెప్పుకోవడానికి ఒక్క హైలైట్ సీన్ కూడా కనిపించదు. ఇక పతాక సన్నివేశాల్లో వైద్య సహాయం కోసం హెలికాప్టర్ ను తీసుకురావడం అతిగా అనిపిస్తుంది. ఈసారి విజయం తనను వెతుక్కుంటూ వస్తుందని ఆశించిన విజయ్ కు డైరెక్టర్ గుమ్మం వరకు తీసుకొచ్చి బయటకు నెట్టేసినట్లైంది పరిస్థితి. 

రేటింగ్: 1.5/5 

loader