Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: కాలా

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది

kaala movie telugu review

నటీనటులు: రజినీకాంత్, నానా పటేకర్, హుమా ఖురేషీ, ఈశ్వరీరావు తదితరులు 
సినిమాటోగ్రఫీ: మురలి జి 
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ 
నిర్మాత: ధనుష్
దర్శకత్వం: పా.రంజిత్ 

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది కానీ కొన్ని కారణాల సినిమా వాయిదా పడి ఈరోజున రిలీజైంది. రజినీకాంత్ నటించిన 'కబాలి' సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాను కూడా రూపొందించాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకు రీచ్ అయిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
ముంబైలో ఉండే ధారావి ప్రాంతాన్ని తన సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు ప్రముఖ రాజకీయనాయకుడు హరిదాదా(నానా పటేకర్). ఆ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీ చేయాలనేది అతడి ఆలోచన. కానీ అతడి ఆలోచనలకు అడ్డుపడుతుంటాడు కరికాలుడు(రజినీకాంత్). అందరూ కాలా అని పిలుచుకునే కరికాలుడు ధారావి ప్రాంతాన్ని అక్కడి ప్రజలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మరి అటువంటి ప్రాంతాన్ని దక్కించుకోవాలని చూసే హరిదాదా లాంటి నాయకుడిని అతడు ఎలా ఎదుర్కొంటాడు. ఈ యుద్ధంలో గెలుపెవరిది..? హరిదాదా తన రాజకీయ పలుకుబడితో కాలాను ఏమైనా చేస్తాడా..? లేక కాలా చేతుల్లో హరిదాదా చనిపోతాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

kaala movie telugu review


నటీనటుల పనితీరు: 
రజనీ గతంలో చేసిన సినిమాలన్నింటిలానే ఈ సినిమాలోనూ ఆయన చరిష్మానే ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. రజనీ స్టైల్, నటన అన్నీ టాప్ క్లాస్ అనేలా ఉన్నాయి. రజనీ స్టైల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆయన మ్యానరిజమ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. కానీ తెరపై హీరోయిజాన్ని ఇంకా బాగా ఎలివేట్ చేసే ఛాన్స్ ఉన్నా దర్శకుడు మాత్రం ఆ ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. కానీ రజినీకాంత్ మాత్రం తనదైన పెర్ఫార్మన్స్ తో సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. హీరోకి సమానమైన విలన్ పాత్రలో నానా పటేకర్ పాత్ర ఆడియన్స్ ను మెప్పిస్తుంది. అతడి పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. అయితే అప్పటివరకు బలంగా తెరపై కనిపించిన విలన్ క్యారెక్టర్ పతాక సన్నివేశాల్లో మాత్రం తేలిపోతుంది. రజినీకాంత్ భార్య పాత్రలో ఈశ్వరీరావు నటన బాగుంది. తన భర్తే ప్రపంచంగా బ్రతికే ఆ క్యారెక్టర్ చనిపోయేప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చడం  ఖాయం. హుమా ఖురేషి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. రజినీకాంత్, హుమా ఖురేషి ల లవ్ ట్రాక్ ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్. వీరిద్దరి మధ్య వచ్చే 'చిట్టెమ్మా' అనే పాట వినడానికి బాగుంది. ఎప్పుడూ రజినీకాంత్ తోనే ఉండే స్నేహితుడి పాత్రలో సముద్రఖని నటన బాగుంది. ఆ పాత్ర ద్వారా కామెడీ పండించే ప్రయత్నం చేశారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు.   


సాంకేతికవర్గం పనితీరు: 
సాంకేతికంగా ఈ సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించారు. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం మెప్పిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సంతోష్ నారాయణ్ కనబరిచిన ప్రతిభ మేజర్ హైలైట్‌గా చెప్పుకోవాలి. జి.మురళి సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన సినిమాటోగ్రఫీ స్టైల్‌తో దర్శకుడి ఆలోచనకు, కథ మూడ్‌కు మురళి ఓ సరికొత్త రూపాన్నిచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇక దర్శకుడిగా రంజిత్ సూపర్ స్టార్ లాంటి స్టార్ ఉన్నా కూడా కథను సహజత్వంగానే చెప్పాలని ప్రయత్నించాడు. అయితే అతడు రాసుకున్న కథను అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో మాత్రం కొన్ని చోట్ల రచయితగా, దర్శకుడిగా విఫలమయ్యాడు. రజనీ స్థాయి ఇమేజ్‌ని అందుకోవడంలో దర్శకుడి ఆలోచన విధానం తేలిపోయింది. ఇవన్నీ అలా ఉంచితే మేకింగ్ పరంగా రంజిత్ చేసిన మ్యాజిక్‌ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. 

kaala movie telugu review

విశ్లేషణ: 
ఈ సినిమా కథా వేగం చాలా నెమ్మదిగా నడవడాన్ని ప్రధానమైన ప్రతికూలాంశంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్‌లో సినిమా నెమ్మదిగా నడిచి చాలాచోట్ల బోర్ కొట్టించింది. ఇంటర్వెల్ కు ముందు వచ్చిన ఫైట్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. 'క్యారే సెట్టింగా' అంటూ ట్రైలర్ లో రజిని చెప్పిన డైలాగ్ వింటే ఈ సినిమాకు ఆ ఫైట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనుకున్నారు. కానీ ఆ సీన్ లో రజినీకాంత్ ఫైట్ చేయకపోవడం అభిమానులను నిరాశ పరుస్తుంది. ఓ బలమైన కథాంశాన్నే ఎంచుకున్న దర్శకుడు, దాన్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో విఫలమయ్యాడు.

ఇక రజనీ సినిమా అంటే ఆయన స్టైల్‌తో పాటు ఆయన ఇమేజ్‌కు సరిపడే అంశాలు కూడా ఉండాలన్నది ఏళ్ళుగా తెలియకుండానే ఓ అలవాటుగా మారిపోయింది. ఈ సినిమాలో అలాంటి అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ ను పెట్టుకొని ఓ వాస్తవిక కథతో సినిమా తీయాలనుకున్న దర్శకుడు ఆయన ఇమేజ్ కు తగ్గ సన్నివేశాలను పెట్టుకునే అవకాశం ఉన్నా.. వాటి జోలికి మాత్రం పోలేదనిపిస్తుంది. ధారావి లాంటి బలమైన కాన్సెప్ట్ ను ఆయన తెరపై సరిగ్గా ఆవిష్కరించలేకపోయారు. అతడి ఆలోచనలను బలవంతంగా ప్రేక్షకులపై రుద్దాలని ప్రయత్నించినా అది వర్కవుట్ కాలేదు.

కథను మొదలుపెట్టిన విధానం ముగించిన తీరు రుచించదు. ఓ ప్రోపర్ కంక్లూజన్ అనేది లేకుండా క్లైమాక్స్ ఎపిసోడ్ తీశారు. విలన్ ను అంత సింపుల్ గా చంపే ఛాన్స్ ఉంటే అదేదో ముందే చేయొచ్చు కదా.. సినిమాను ఎందుకు ఇంతసేపు తీయడం అనిపిస్తుంది. రజనీ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే వెళితే మాత్రం నిరాశ తప్పదు. రజినీకాంత్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు కూడా ఈ సినిమా నచ్చే ఛాన్స్ లేదనే చెప్పాలి. రజినీకాంత్ ఎలివేషన్ షాట్స్, రెండు యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఈ సినిమా చూసే సాహసం చేయొచ్చు. 

రేటింగ్: 2.5/5 

Follow Us:
Download App:
  • android
  • ios