Asianet News TeluguAsianet News Telugu

సీఎం పదవిపై జూనియర్ ఎన్టీఆర్ గురి.. మనసులో మాట వెల్లడి

  • నందమూరి వారసత్వం పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్
  • నేడు జూనియర్ పుట్టినరోజు.. ఆయన మనోభావాలు చెప్పాడు
  • సీఎం పదవిపై మనసులో మాట బైటపెట్టిన జూనియర్ ఎన్టీఆర్
junior ntr targets ap chief minister cm seat

స్వర్గీయ నందమూరి తారక రామారావు లక్షణాలు అణువణవూ పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రస్థుత తెలుగుదేశం పార్టీతో ఆయనకున్న  సంబంధాలపైనా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికీ ఆయనకూ మధ్య సంబంధాలు చెడిపోయాయనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. అంతే కాదు.. కుటుంబంలో ఒకరైన బాబాయ్ బాలయ్యకు కూడా జూనియర్ దూరమయ్యాడనే వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి ఎన్నో అంశాలపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మనోభావాలు ఎలా వున్నాయో చూద్దాం.

 

సుదీర్ఘంగా సాగిన ఇంటర్వ్యూలో... ఇంటర్వ్యూయర్ ప్రశ్నలకు జూనియర్ ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. సీఎం పదవి చేపడుతారా అనే ప్రశ్నకు ఆయన అంత సూటిగా సమాధానం చెప్పకుండా చాలా చాకచక్యంగా మాట్లాడారు. జీవితంలో రాని పేజీ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటే ప్రయోజనం లేదని అన్నారు. తన జీవితం తాతయ్య ఆశీర్వాద ఫలితమేనని చెప్పారు. "నిజంగా తెలియదు.. ఆ ఆలోచన లేదు. ఇంతవరకు అలా లేదు... ఒకవేళ ఆ ఆలోచన మొదలైతే ముందు మీకే ఫోన్‌ చేస్తాను.. ఇది తప్పా, ఒప్పా అని అడుగుతా. ఒకవేళ నుదుటిపై రాసుంటే జరుగుతుందంతే.. సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదు" అన్నారు జూనియర్.

 

ఎన్టీఆర్‌ కుటుంబంలో తనకు బాలయ్య బాబాయ్ ఎక్కువ ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. బాలయ్య బాబాయ్ చాలా మంచి మనిషి అని, అద్భుతమైన మనిషి అని పొగిడేశారు. తనకూ బాలయ్యకు మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మరోవైపు చంద్రబాబునాయుడితోనూ సంబంధాలు తెంచుకోవడానికి జూనియర్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. చంద్రబాబుతో తనకు మంచి సంబంధాలున్నాయని, నా మీద నమ్మకంతోనే ప్రచారం కోసం అడిగారని అన్నారు. ఇక ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించిన ఎపిసోడ్ చూసినప్పుడు మీకేమనిపించిందని అడిగితే... అప్పుడు తన వయస్సు చాలా చిన్నదని.. అదెలా జరిగిందో తెలియదని, కార్యకర్తలంతా కలిసి తీసుకున్న నిర్ణయమని, ప్రజాస్వామ్యంలో ఇదంతా సాధారణమని ఎన్టీఆర్ సమాధానమిచ్చారు.మరి సీఎం పదవిలో ఉన్న చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకనుకున్నాడో, లేక టీడీపీ అంతా బాబు చేతిలోనే ఉందనే ఆనుకున్నాడో..గానీ  బాబుతో సంబంధాలు మరింతగా చెడిపోకుండా వ్యూహాత్మకంగా సమాధానమిచ్చాడు జూనియర్.

 

ఇక సినిమా తన బతుకుతెరువు అని, రాజకీయాలు తన బాధ్యత అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకున్నారు. టిడిపికి ప్రచారం చేయడం తన బాధ్యత అని, ఎన్టీఆర్ మనవడిగా పుట్టినందుకు తన వంతు బాధ్యతను నెరవేర్చానని అన్నారు. తాను ప్రచారం చేసినప్పటికీ టిడిపి ఓడిపోవడంపై "అధికారంలోకి వస్తామా.. లేదా అన్నది వేరు. ఓట్లు ఎక్కడ చీలాయో, ఎక్కడ పడ్డాయో.. ఆ లెక్కలు వేరు. కానీ ఓ ప్రయత్నం చేశా" అని అన్నారు. అధికారంలోకి రానంత మాత్రాన అది తెలుగుదేశం పార్టీకి ముగింపు కాదని, ప్రచారబాధ్యతలను నిరంతరం కొనసాగిస్తానన్నారు.

 

ఇక ఎన్టీఆర్‌ ఆశీర్వాదం తనకు ఆస్తి అని ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. బాబాయ్‌ బాలకృష్ణ, నాన్న హరికృష్ణ, తాను, కళ్యాణ్‌రామ్‌, తారకరత్న..తామంతా టీడీపీకి ఆస్తి అన్నారు. మొదట్నుంచి నాన్న తనకు చాలా సపోర్టివ్‌గా ఉండేవారని, ఆయన కూడా తాతగారిలాగే చాలా బోళా మనిషి అని, బాలయ్య బాబాయ్‌ కూడా అంతేనని జూనియర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇంటర్వ్యూ అంతా చూస్తే.. సీఎం పదవిపై మనసులో ఎక్కడో మూల ఖచ్చితంగా జూనియర్ టార్గెట్ చేశాడని మాత్రం అర్థమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios