అందాల తార శ్రీదేవి ఇకలేరనే వార్త సినీలోకానికి విషాదంలోకి నెట్టింది. సొంత కూతుళ్లు జాహ్నవి, ఖుషీకపూర్ పరిస్థితి ఇక చెప్పనక్లర్లేదు. తన జీవితంలో తల్లి లేదనే వార్తతో ఒక్కసారిగా కుంగిపోయారు. కన్నీరుమున్నీరై విషాదంలోకి జారుకొన్నారు. దుబాయ్‌లో శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. షూటింగ్ కారణంగా జాహ్నవి, ఇతర కారణాలతో ఖుషీ ముంబైలోకి ఉండిపోయారు. అయితే తల్లి మరణావార్తతో కంగుతున్న వారిని ఓదార్చే బాధ్యతను దర్శకుడు కరణ్ జోహర్ తీసుకొన్నారు.

 

దడక్ అనే చిత్రం ద్వారా జాహ్నవి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఆమెను లాంచ్ చేసే బాధ్యతను దర్శకుడు కరణ్ జోహర్ తీసుకొన్న సంగతి తెలిసిందే. దడక్ షూటింగ్ బిజీ కారణంగానే ఆమె దుబాయ్ వెళ్లకుండా ముంబైలో ఆగిపోయారు. పెళ్లికి హాజరైన ఖుషీ కపూర్ తన తండ్రి బోనికపూర్‌తో అంతకుముందు రోజే ముంబైకి తిరిగి వచ్చారు.
 

శ్రీదేవి మరణించారని తెలియగానే జాహ్నవి, ఖుషీ దు:ఖంలో మునిగిపోయారు. లోకండ్‌వాలాలోని ఇంట్లో ఒంటరిగా ఉన్నారని తెలుసుకొన్న కరణ్ వెంటనే శ్రీదేవి నివాసానికి చేరుకొన్నారు. ఇద్దరినీ ఓదార్చి జుహులోని అనిల్‌కపూర్‌ ఇంటికి తీసుకెళ్లారు. తల్లి మరణంతో శోకసంద్రంలో మునిగిన జాహ్నవి వెంట ప్రస్తుతం రేష్మాశెట్టితోపాటు ఇతర స్నేహితులు ఉన్నారు. జాహ్నవి మేనేజర్ కూడా సంరక్షణ బాధ్యతను చేపట్టారు. శనివారం నుంచి దు:ఖంలో మునిగిపోయిన వారిని ఆపేతరం కావడం లేదని బంధువులు, సన్నిహితులు తెలిపారు.

 

శ్రీదేవి మరణవార్త సమయంలో అనిల్ కపూర్ ఓ చిత్రం షూటింగ్ కోసం చంఢీగడ్ వెళ్లారు. ఈ విషయం తెలియగానే ఆయన హుటాహుటిన ముంబైకి చేరుకొన్నారు. ఆ తర్వాత వెంటనే దుబాయ్ వెళ్లి సోదరుడు బోనికపూర్‌కు అండగా నిలిచారు. ఇప్పటికే బోని, శ్రీదేవి కుటుంబ సభ్యులు, బంధువులు జుహులోని అనిల్ కపూర్ ఇంటికి చేరుకొన్నారు.

 

అనిల్ కపూర్ ఇంట్లో ఉన్న జాహ్నవి, ఖుషీ కపూర్‌ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. వారిని పరామర్శించిన వారిలో ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, అనుపమ్ ఖేర్, అన్నుకపూర్, మాధురీ దీక్షిత్, ఆమె భర్త నేనే, కమల్ హాసన్, శృతీ హాసన్, అక్షర హాసన్ ఉన్నారు.