ఏప్రిల్ 25న స్ట్రీమింగ్ మొదలైన సినిమా, రెండు వారాల్లోనే 1.61 కోట్ల వ్యూస్‌తో సూపర్ హిట్.

థియేటర్లతో పాటు, లేదా అంతకన్నా ఎక్కువగా ఇప్పుడు ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లనే ఆశ్రయిస్తున్నారు. థియేటర్లలో బాక్సాఫీస్ కలెక్షన్ లాగా, ఓటీటీలో సినిమాలకు వచ్చే ఆదరణ తెలుసుకోవడానికి మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది వ్యూస్. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది అత్యధికంగా వ్యూస్ సాధించిన సినిమా ఏదో తెలిసింది. సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన 'జ్యువెల్‌ థీఫ్‌' అనే హిందీ సినిమా ఈ ఘనత సాధించింది. కూకీ గులాటీ, రోబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు.

ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైన ఈ సినిమాకు మొదటి వారంలో 7.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రెండో వారంలో 8.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే రెండు వారాల్లో 16.1 మిలియన్ వ్యూస్, అంటే 1.61 కోట్ల వ్యూస్. ఈ విజయం సినిమాను ఇంకా ఎక్కువ మంది చూడటానికి దోహదపడుతుంది. విశేషమేంటంటే, సినిమాకు విమర్శకుల నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా, ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంది.

హెయిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాను మార్ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ ఆనంద్, మమ్తా ఆనంద్ నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్‌తో పాటు జయదీప్ అహ్లవత్, నిఖితా దత్తా, కునాల్ కపూర్, కుల్ భూషణ్ ఖర్బందా, ఉజ్జ్వల్ గౌరవ్, గగన్ అరోరా, షాజీ చౌదరి, సుమిత్ గులాటీ తదితరులు నటించారు.

డేవిడ్ లోగన్ కథ రాశారు. సుమిత్ అరోరా సంభాషణలు రాశారు. జిష్ణు భట్టాచార్జి సినిమాటోగ్రఫీ అందించారు. ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ 'పఠాన్' సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను నిర్మించారు.