జయలలిత జీవితంలో శశికళ పాత్రపై సినిమా ఈ సినిమాను తెరకెక్కించనున్న కేతిరెడ్డి జగదీశ్ లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంతో పాటు తెరకెక్కిస్తానన్న కేతిరెడ్డి
కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో నందమూరి తారకరామారావు, లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ కేతిరెడ్డే జయలలిత-శశికళపై సినిమా తీస్తానని ప్రకటించారు. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ‘శశిలలిత’ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు చెప్పిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి... ఈ సినిమా దర్శకత్వ, నిర్మాణ బాధ్యతల్ని తానే నిర్వర్తించనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే సెట్స్ పైకి వస్తుందన్నారు. లక్ష్మీపార్వతి జీవితం, శశికళ జీవితం ఒకటేనని, సేవకురాలిగా ఒకరి జీవితంలోకి ప్రవేశించిన వీరు.. ఎలా చక్రం తిప్పారనే ఇతివృత్తంగా ఈ సినిమా కథలు ఉంటాయన్నారు. ఇద్దరి లక్ష్యం రాజ్యాధికారం మాత్రమే అనే అంశాలతో తీయనున్న సినిమాలు ఇవి అన్నారు. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’, ‘శశిలలిత’ సినిమాలలో నేటి సమకాలీన రాజకీయాలు, యాదార్థ సంఘటనలు చూపించనున్నామన్నారు.
‘జయలలిత జీవితంలో శశికళ ప్రవేశం, ఆసుపత్రిలో జరిగిన ప్రతి సంఘటన అంటే.. సెప్టెంబరు 22 నుంచి డిసెంబరు 5 వరకు జరిగిన ప్రతి సన్నివేశం ఈ సినిమలో చూపిస్తామ్నారు. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’లో ‘విశ్వరూపం’, ‘గరుడవేగ’ ఫేం నటి పూజా కుమార్ లక్ష్మీపార్వతి పాత్రలో నటించనున్నారని ఈ సందర్భంగా తెలిపారు. శశికళ, జయలలిత పాత్రల కోసం హీరోయిన్లను త్వరలోనే ఎంపిక చేస్తామని చెప్పారు. ఇదిలావుంటే వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. జయలలిత-శశికళపై సినిమా తీస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
