రిలీజైన కొద్దజి గంటల్లోనే సంచలనాలు నమోదు చేస్తున్న జైలవకుశ టీజర్ గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన ఎన్టీఆర్ టీజర్ నత్తి పాత్ర చేసే ధైర్యం జూనియర్ ఎన్టీఆర్ కే చెల్లిందన్న రాఘవేంద్ర రావు 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశ సినిమా టీజర్ కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తాను చాటుతోంది. ఈ టీజర్ బాహుబలి రికార్డుకే ఎసరు పెట్టే రేంజ్ లో దూసుకెళ్తోంది. గురువారం సాయంత్రం టీజర్ విడుదలైన తర్వాత ఇంటర్నెట్‌లో సునామీగా మారింది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ చూపి హావభావాలపై సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ దర్శకులు రాజమౌళి, హరీశ్ శంకర్, కొరటాల శివ లాంటి దర్శకులు ఈ టీజర్ చూసి ఫిదా అయిపోయారు. 

‘ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల.. ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దదద.. ధైర్యం ఉండాల' అంటూ ఎన్టీఆర్ విసిరిన శ్యాంపిల్ డైలాగ్‌కే రచ్చరచ్చ అయిపోతున్నది. ఇలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్న జై లవకుశ టీజర్‌పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్విట్టర్ సెన్సేషనల్ కామెంట్ పెట్టారు. ఎప్పుడో ఒకప్పుడు తప్ప సోషల్ మీడియాలో స్పందించని రాఘవేంద్రరావు కామెంట్‌ ప్రస్తుతం మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ చూసిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ఫిదా అయిపోయారు. ‘ఇలాంటి పాత్రలు చేయాలంటే దదద.. ధైర్యం కావాలి. ఆ ధైర్యం మా తారక్‌కి ఉంది. ఆ ధైర్యాన్ని తెరమీద చూడడానికి నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. రాఘవేంద్రరావు కామెంట్‌ను చాలా మంది రీట్వీట్ చేసి ఆయన ప్రశంసకు మద్దతు పలికారు.

ఇంటర్నెట్‌లో సునామీలా జై లవకుశ టీజర్‌కు వస్తున్న విశేష స్పందన చూసి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, మీడియా నుంచి వెల్లువెత్తుతున్న ప్రేమ, వారి అభినందనలు, ఫీడ్‌బ్యాక్‌తో చాలా ఆనందంగా ఉంది. ఇంకా మెరుగైన నటనను ప్రదర్శించేందుకు కృషి చేస్తాను. లవ్ యూ ఆల్ అని జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

టాలీవుడ్ చరిత్రలో అత్యంత వేగంగా 100k లైక్స్ సాధించిన టీజర్‌గా జై లవ కుశ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 100 నిమిషాల్లోనే ఈ ఘనతను సాధించింది. ఈ రికార్డు గురించి ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సినీ నటుడు కల్యాణ్ రామ్ నిర్మాతగా మారి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.