సిట్ విచారణకు రేపే హాజరుకానున్న ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌజ్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ముమైత్ సిట్ కార్యాలయంలో బిగ్ బాస్ కెమెరాల బదులు పోలీస్ కెమెరాలు 

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సిట్ నోటీసులు అందుకున్న టాలీవుడ్ సెలెబ్రిటీల్లో ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్ కూడా ఉంది. ప్రస్థుతం ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా వున్న ముమైత్ ఖాన్ విచారణలో భాగంగా సిట్ కార్యాలయానికి వచ్చేందుకు బిగి బాస్ బౌజ్ నుంచి బయటికొస్తోంది. ముమైత్ రేపు హైదరాబాద్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానుంది.

బిగ్ బాస్ నియమ నిబంధనల ప్రకారం 70 రోజులపాటు ఆ ఇంటిని వదిలి బయటికి రాకూడదు. అయితే ముమైత్ ఖాన్ రేపు విచారణకు హాదరవుతుందని షో నిర్వహిస్తున్న స్టార్ మా చానెల్ నుంచి కూడా సిట్ కు అధికారికంగా లిఖితపూర్వక హామీ పత్రం అందించింది. దీంతో ముమైత్ సిట్ విచారణకు హాజరైతే తదుపరి బిగ్ బాస్ షోకు గుడ్ బై చెప్పినట్లేనా.. లేక హాజరయ్యాక తిరిగి హౌజ్ లో కంటిన్యూ అవుతుందా అనేదానిపై ఆసక్తి నెలకొంది.

ముమైత్ ఖాన్ ఇంటి అడ్రస్ దొరక్క చాలాకాలం పాటు సిట్ అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే బిగ్ బాస్ షో ప్రారంభం కావడంతో ఆ ఇంటి అడ్రస్ కనుక్కున్న పోలీసులు.. పుణె సమీపంలోని ఆ ఇంటికెళ్లి ముమైత్ కు నోటీసులు అందించారు. నోటీసులైతే అందుకుంది కానీ.. ఆమె విచారణకు వస్తుందా.. లేదా.. అనే సస్పెన్స్ సాగింది. అయితే ముమైత్ మాత్రం తాను 27న విచారణకు సిట్ కార్యాలయానికి వస్తానని సమాచారం పంపింది. ఇందు కోసం స్టార్ మా ఛానెల్ బిగ్ బాస్ హౌజ్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుంది ముమైత్.

మరోవైపు ముమైత్ తప్పక విచారణకు హాజరవుతానని చెప్పినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా ధృవీకరించారు. దీన్ని బట్టి ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షో నుంచి బయటకు రావడం ఖాయమని తెల్సిపోయింది. అయితే బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకుంది..? నిబంధనలు ఉల్లంఘించి వస్తుందా..? లేక ప్రత్యేక అనుమతి తీసుకుని హాజరవుతోందా అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే.. ముమైత్ ఖాన్ బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఒకరోజు పాటు ప్రత్యేక అనుమతి తీసుకుందని తెలుస్తోంది. కేసు తీవ్రతను అర్థం చేసుకున్న బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా ఆమెను విచారణకు పంపుతామని అధికారులతో చెప్పి మరీ, ప్రత్యేక అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె పుణె నుంచి నేరుగా విచారణకు హాజరుకానుంది.

విచారణ అనంతరం మళ్లీ ఆమె పుణె సమీపంలోని బిగ్ బాస్ హౌస్ కు పయనమవుతుంది. దీంతో.. ముమైత్ ఎంక్వరీపై అనుమానాలు తొలగిపోయాయి. అయితే ఒకరోజు పాటు బిగ్ బాస్ షోలో మిస్సవుతున్న ముమైత్ చుట్టూ బిగ్ బాస్ కెమెరాలు పోయి ఇక పోలీసుల కెమెరాలు నిఘా పెట్టనున్నాయి.