Asianet News TeluguAsianet News Telugu

'ఇంట్లో దెయ్యం నాకేం భయం' మూవీ రివ్యూ

  • జోనర్ - కామెడీ
  • దర్శకత్వం - జి. నాగేశ్వర్ రెడ్డి
  • నిర్మాత - బివిఎస్ఎన్. ప్రసాద్
  • సంగీతం - సాయి కార్తీక్
  • నటీనటులు - నరేష్, కృతిక జయకుమార్, మౌర్యాని
intlo deyyam nakem bhayam review

కథ :

బ్యాండ్ మేళం ట్రూపుకి ఓనర్ అయిన నరేష్ (అల్లరి నరేష్) అనుకోకుండా ఒకరి సహాయం చేయాల్సి వచ్చి అప్పుల్లో ఇరుక్కుని డబ్బు కోసం ఒక ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరిమేస్తానని కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి స్నేహితులతో సహా ఇరుక్కుపోతాడు.

అలా ఇరుక్కుపోయిన నరేష్ చివరికి దెయ్యం వలన తన ప్రేమనే వదులుకోవాల్సి పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నరేష్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు ? అసలు దెయ్యానికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి ? అతను తన ప్రేమను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది ? చివరికి నరేష్ ప్రేమ, అతన్ని కష్టపెడుతున్న దెయ్యం కథ ఏమయ్యాయి ? అనేదే ఈ సినిమా కథ.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగానికొస్తే దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్నా రొటీన్ కథ, కథనాలతో బోర్ కొట్టించాడు. అలాగే హర్రర్ ఎలిమెంట్ కూడా బలహీనంగానే ఉంది. సాయి కార్తీక్ అందించిన సంగీతం కొన్ని పాటల్లో బాగుంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కాస్త కొట్టగానే అనిపించింది. ఎడిటింగ్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ప్రతి ఫ్రేమ్ బాగుంది. డైమండ్ రత్నబాబు డైలాగులు పర్వాలేదనిపించాయి. బివిఎస్ఎన్. ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది నరేష్ కామెడీ గురించి. చాలా కాలం నుండి నరేష్ లో మిస్సైన కామెడీ తరహా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో కాస్తో కూస్తో దొరికిందనే చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ నుండి ఎండింగ్ వరకు నడిచే కామెడీ ట్రాక్ చాలా చోట్ల మంచి నవ్వుల్ని పూయించింది. అతనికి తోడు షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ ల కామెడీ కూడా బాగానే వర్కవుటైంది. ఫస్టాఫ్ అంతా వీళ్ళ కామెడీతోనే సాగుతూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.

ఇక సెకండాఫ్ లో దెయ్యాన్ని ఎలివేట్ చేస్తూ తీసిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కేవలం ప్రధాన పాత్రలనే కాకుండా ఇతర పాత్రలతో చేయించిన కామెడీ, హర్రర్ సన్నివేశాలు కొంత వరకు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్లో వచ్చే చిన్నపాటి ట్విస్ట్ కూడా బాగుంది. ఇక నరేష్, కృతిక జయ కుమార్ ల లవ్ ట్రాక్ బాగుంది. కృతిక జయకుమార్ సినిమాలో చాలా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. దెయ్యం పాత్ర పోషించిన సెకండ్ హీరోయిన్ మౌర్యాని నటన కూడా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ కొస్తే ఈ హర్ర కామెడీ జానర్ కు కావలసిన కామెడీ, హర్రర్ ఎంటర్టైన్మెంట్ ఉన్నా కథ చాలా రెగ్యులర్ గా ఉంది. అందులో కొత్తదనమేమీ కనబడలేదు. ఇక కథనంలోనైనా వెరైటీ ఎమన్నా ఉందా అంటే అదీ లేదు. ఇంటర్వెల్ సమయంలో వచ్చే చిన్నపాటి ట్విస్ట్ మినహా సెకండాఫ్ లో జరగబోయే ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించేంత రోటీన్ గా ఉన్నాయి. అలాగే కథలోని ప్రధాన పాత్రలను కాకుండా ఇతర ప్రతి పాత్రను దెయ్యంతో ఇంటరాక్ట్ చేయడం కొంత వరకు బాగానే ఉన్నా కాసేపటికి అనవసర సన్నివేశాలు ఎక్కువై బోర్ కొట్టించాయి.

ఇక ఈ చిత్రంలో కామెడీ ఉన్నా కూడా నాగేశ్వర్ రెడ్డి, నరేష్ ల కాంబోలో వచ్చిన గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి. ఇక ప్రతి హర్రర్ సినిమాలానే ఈ చిత్ర క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంది. కథ మధ్యలో ప్రేమ అనే పాయింటును సరిగ్గానే జొప్పించినా దాన్ని చివరి వరకూ తీసుకురావడం, దానికి మంచి ఫీల్ తో కూడిన ముగింపు ఇవ్వడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. కథలో కీలకమైన దెయ్యం బ్యాక్ డ్రాప్ కూడా చాలా రొటీన్ గా, బలహీనంగా ఉండటంతో ఆ పాత్రతో కనెక్టవడం కష్టమైంది. దెయ్యానికి రెండు లక్ష్యాలు ఏర్పడటంతో ఏ ఒక్కదానికీ నూటికి నూరు శాతం న్యాయం జరక్క ముగింపు వెలితిగా అనిపించింది.

చివరగా:

నరేష్ చాలా కాలం తరువాత చేసిన ఈ సినిమాతో కూడా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడనే చెప్పాలి. ఎంటర్టైనింగ్ గా సాగే ఫస్టాఫ్, సినిమా ఆద్యంతం నడిచే కామెడీ, హీరో హీరోయిన్ల నటన, కొన్ని హార్రర్ సన్నివేశాలు ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా రొటీన్ గా ఉన్న కథ కథనాలు, బలహీనమైన దెయ్యం బ్యాక్ డ్రాప్, అసంతృప్తిగా ముగిసే క్లైమాక్స్, ఎక్కువైన అనవసరపు సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే నరేష్ కామెడీని హర్రర్ సినిమాల్ని ఇష్టపడుతూ బోరింగ్ కథా కథనాలను తట్టుకోగలిగే ప్రేక్షకులకు ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios