Asianet News TeluguAsianet News Telugu

సి కల్యాణ్ ను కోట్లల్లో ముంచేసిన సాయిధరమ్ తేజ్

  • సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఇంటిలిజెంట్
  • స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం
  • సి కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ మూవీకి భారీ లాస్

 

huge loss to ckalyan with saidharamtej intelligent

సంక్రాంతి బరిలో బాలయ్య జైసింహతో హిట్టు కొట్టిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌కు ‘ఇంటిలిజెంట్’ రూపంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కెరీర్‌లోనే అతిచెత్త సినిమా అనే అపఖ్యాతిని మూటగట్టుకుంది. దీంతో ఈ సినిమాకు అసలు వసూళ్లే కరువయ్యాయి. వి.వి.వినాయక్ మీద అపారమైన నమ్మకంతో చాలా చోట్ల సి.కళ్యాణ్ సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ ఆయన నమ్మకం బెడిసికొట్టింది. అట్టర్ ప్లాప్ టాక్‌తో ‘ఇంటిలిజెంట్’ వెనకబడిపోయింది. దీనికి తోడు ‘తొలిప్రేమ’, ‘ఛలో’ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ‘ఇంటిలిజెంట్’ వైపు ఎవరూ చూడటంలేదు.



మొత్తం మీద నిర్మాత సి.కళ్యాణ్‌కు భారీ నష్టమే మిగిల్చింది ఈ సినిమా. సుమారు రూ.15 కోట్లు నష్టపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘జైసింహా’ సినిమా సి.కళ్యాణ్‌కు గొప్పగా లాభాలు తేలేకపోయినా నష్టం మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు ‘ఇంటిలిజెంట్’ మాత్రం కళ్యాణ్‌ను ముంచేసింది. సినిమా బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం దర్శకుడు వినాయక్‌కే వెళ్లడం గమనార్హం. ఆయన పారితోషికం కింద రూ.10 కోట్లు తీసుకున్నారట. అయితే ఇప్పుడు నష్టాలు రావడంతో వినాయక్ కొంత డబ్బును కళ్యాణ్‌కు తిరిగి ఇచ్చినట్లు సమాచారం.



సినిమా విడుదలకు ముందు అమ్ముడుపోయిన శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా వచ్చిన సొమ్ము తప్ప బాక్సాఫీసు నుంచి వచ్చింది ఏమీలేదట. మరోవైపు వరుస పరాజయాలతో డీలాపడిన సాయిధరమ్ తేజ్‌కు కూడా ఈ సినిమా పెద్ద దెబ్బే అని చెప్పాలి. వి.వి.వినాయక్‌పై ఉన్న నమ్మకంతో కథను కూడా సరిగా వినకుండా తేజూ సినిమాను ఒప్పుకొని ఉంటాడని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, సాయాజీ షిండే, రాహుల్ దేవ్, సప్తగిరి, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios