ఇండియాలో బయోపిక్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది.. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఆయా రాష్ట్రాల్లోని బాగా పాపులర్ అయిన వ్యక్తుల జీవితాలకు దృశ్యరూపం ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు వూవ్విళ్లూరుతున్నారు. రోటీన్ పాత్రలు చేసి చేసి బోర్ కొట్టిందేమో.. హీరోలు, హీరోయిన్లు కూడా నిజజీవిత పాత్రలు చేసేందుకు సై అంటున్నారు.

అయితే రెగ్యులర్ పాత్రలు వేరు.. రియల్ లైఫ్ స్టోరీలు వేరు. ఎందుకంటే వారు పోషించబోయే వ్యక్తులు ఆయా రంగాల్లో అత్యున్నత శిఖరాలు  అధిరోహించినవారు.. కోట్లాదిమంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న వారు. పాత్ర చిత్రణలో హవభావాల్లో ఏమాత్రా తేడా వచ్చినా.. జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే అన్ని రకాల ఆలోచనలు పెట్టి క్యారెక్టర్‌లో లీనమయ్యేందుకు నటీనటులు సిద్ధమవుతున్నారు.

మొన్నటికి మొన్న మహానటి కోసం కీర్తి సురేశ్ చాలా కష్టపడింది. నిన్న గాక మొన్నొచ్చిన వీళ్లే ఈ రేంజ్‌లో కష్టపడితే మరి మూడు దశాబ్ధాల అనుభవం ఉన్న మమ్ముట్టి ఇంకెలా శ్రమించాలి. ప్రస్తుతం మలయాళ మెగాస్టార్.. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ అనే సినిమా చేస్తున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మమ్ముట్టి.. వైఎస్ఆర్ రోల్‌లో నటిస్తున్నాడు..

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, సంక్షేమ పథకాల రూపశిల్పిగా ఆయన వైఎస్ కోట్లాదిమంది చేత నీరాజనాలు పొందుతున్నారు. అలాంటి వ్యక్తి క్యారెక్టర్‌ కావడంతో మమ్ముట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. తాజాగా విడుదలైన ‘యాత్ర’ టీజర్ చూసి.. మమ్ముట్టి అచ్చుగుద్దినట్లు వైఎస్‌లా ఉన్నారే అని జనం ప్రశంసిస్తున్నారు.. ఇందుకు మమ్ముట్టి ఎంతో కష్టపడ్డారు.

వైఎస్ యాస, భాష, కట్టు, బొట్టు, ఆహార్యం తదితర విషయాల మీద అవగాహన పెంచుకుంటున్నారు.. వైఎస్ఆర్ స్పీచులు, ప్రజలతో మమేకమవ్వడం వంటి వీడియోలు చూస్తున్నారట.. ప్రత్యేకంగా తెలుగు టీచర్‌ను పెట్టుకుని డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నారని డైరెక్టర్ మహి తెలిపాడు. మహానేత పాత్రలో ఒదిగిపోవడానికి మమ్ముట్టి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారట. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా సినిమా పూర్తి డిసెంబర్ నాటికి యాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని రాఘవ్ స్పష్టం చేశాడు.