అక్షయ్ కుమార్ నటించిన కామెడీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అనేక విషయాలు ఉన్నాయి. వీటిలో ఒక నటుడు ట్రిపుల్ రోల్ చేయడం, ‘హౌస్‌ఫుల్’ మొదటి భాగంతో దీనికి ఉన్న కనెక్షన్ కూడా ఉన్నాయి. అవేంటో `హౌస్‌ఫుల్‌ 5` రివ్యూలో తెలుసుకుందాం. 

శుక్రవారం (6 జూన్)న విడుదలైన ‘హౌస్‌ఫుల్’ సినిమాలో అదిరిపోయే కామెడీ, సస్పెన్స్, డైలాగులతో పాటు చాలా షాకింగ్ విషయాలు కూడా ఉన్నాయి. తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ కామెడీ ఫ్రాంచైజీ ‘హౌస్‌ఫుల్’కి ఐదో భాగం. 

ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, ఫర్దీన్ ఖాన్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చంకీ పాండే, జానీ లివర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గిస్ ఫఖ్రీ, చిత్రాంగద సింగ్, సౌందర్య శర్మ, శ్రేయస్ తల్పాడే, రంజిత్, నిఖితన్ ధీర్, ఆకాశ్‌దీప్ సబీర్ వంటి స్టార్స్ నటించారు. సినిమాలోని 5 అతిపెద్ద షాకింగ్ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం...

1. బాబీ డియోల్ అతిథి పాత్ర

‘హౌస్‌ఫుల్ 5’లో బాబీ డియోల్ అతిథి పాత్ర ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌ లాంటిది. ఈ సినిమాలో వ్యాపారవేత్త రంజిత్ డోబ్రియాల్ (రంజిత్) అసలు కొడుకు జలాలు అలియాస్ జాలీ పాత్రలో నటించారు. క్లైమాక్స్‌లో ఆయన ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు కొట్టారు. అక్షయ్, రితేష్, అభిషేక్ తర్వాత జాలీ నంబర్ 4గా సినిమాలోకి వచ్చారు.

2. ‘హౌస్‌ఫుల్’ మొదటి భాగంతో కనెక్షన్

‘హౌస్‌ఫుల్ 5’కి దాని మొదటి భాగంతో కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ జంతువులతో ఉండటం విశేషం. మొదటి భాగంలోని చిలుక పరాడ (రితేష్ దేశ్‌ముఖ్-లారా దత్త పెంపుడు చిలుక) గుర్తుంటే, ఈ కనెక్షన్‌ని వెంటనే అర్థమైపోతుంది. మొదటి భాగంలో అక్షయ్ కుమార్ పాత్ర వాక్యూమ్ క్లీనర్ వర్క్ చేస్తూ పొరపాటున పరాడని చంపేస్తాడు.

 ‘హౌస్‌ఫుల్ 5’లో పరాడ కొడుకు గూచీని చూపించారు. అతను అక్షయ్‌ని చూడగానే గుర్తుపట్టి, ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే, కథలో అతని గతి కూడా తన తండ్రిలాగే అవుతుంది.

‘హౌస్‌ఫుల్ 1’తో సినిమాకి ఉన్న మరో కనెక్షన్ ఏంటంటే, మొదటి భాగంలోలాగే ఇందులో కూడా అక్షయ్ కుమార్ కోతులతో పోరాడుతున్నట్లు చూపించారు. ఈ కోతులు మొదటి భాగంలో కనిపించిన కోతి మనవళ్లు. అవి అక్షయ్‌తో గొడవ పడతాయి. కోతులకు, అక్షయ్ కుమార్‌కి మధ్య ఉన్న సన్నివేశం చూసి మీరు నవ్వు ఆపుకోలేరు.

3. అర్చనా పూరణ్ సింగ్, మిథున్ చక్రవర్తి అతిథి పాత్రలు

‘హౌస్‌ఫుల్ 5’లో అర్చనా పూరణ్ సింగ్, మిథున్ చక్రవర్తి అతిధి పాత్రలు కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అయితే, వారిద్దరూ నేరుగా కనిపించలేదు. కానీ వారి ఫోటోలను ఉపయోగించారు. అర్చనను రంజిత్ డోబ్రియాల్ మొదటి భార్యగా, మిథున్ చక్రవర్తిని దొంగగా చూపించారు.

4. జానీ లివర్ ట్రిపుల్ రోల్

‘హౌస్‌ఫుల్ 5’లో జానీ లివర్ ట్రిపుల్ రోల్ చేశారు. అయితే, నిజంగా ఆయన ఒక పాత్రలో (బటుక్ పటేల్) మాత్రమే కనిపించారు. మిగతా రెండు పాత్రలు ఫోటోలలో చూపించారు. ఒక పాత్రలో ఆయన బటుక్ చెల్లెలిగా నటించారు. మరో పాత్రలో ఆయన తన పూర్వీకుల ఫోటోలో కనిపించారు.

అదేవిధంగా అభిషేక్ బచ్చన్ డబుల్ రోల్ చేశారు. జాలీతో పాటు టీవీ న్యూస్‌లో ఒక నిందితుడిగా కూడా కనిపించారు. చంకీ పాండే కూడా సినిమాలో రెండు పాత్రలు పోషించారు. ఆఖరి పాస్తాతో పాటు తన చెల్లెలి పాత్ర కూడా చేశారు. చివర్లో బటుక్ ఆఖరి పాస్తా చెల్లెల్ని, ఆఖరి పాస్తా బటుక్ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఒకరికొకరు బావమరుదులవుతారు.

5. నానా పటేకర్ డాన్స్, యాక్షన్

74 ఏళ్ల నానా పటేకర్ ఈ సినిమాలో ఇంటర్‌పోల్ అధికారి దగ్డూ పాత్ర పోషించారు. ఆయన అద్భుతంగా నటించారు. సినిమాలోని ‘ఫుగడీ’ పాటలో ఆయన డాన్స్ అదుర్స్. అలాగే, ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయాయి.