పడక సుఖానికి సినీ హీరొయిన్ ఛాన్స్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. టాలీవుడ్ లో తాజాగా శ్రీరెడ్డి ఈ రచ్చను పీక్స్ కు తీసుకెళ్ళిపోవడం, మీడియాలో బాగా ప్రచారం కావడంతో కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. అమ్మాయిలు పరిశ్రమలోకి రావాలంటే తమ శీలాన్ని పణంగా పెట్టి తీరాల్సిందే అన్న విధంగా తప్పుడు ప్రచారం కూడా జనంలోకి వెళ్ళడం పట్ల ఇండస్ట్రీ పెద్దల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

 

కాస్టింగ్ కౌచ్ అసలు లేదని చెప్పడం తప్పవుతుంది కాని మొత్తం అందరు అలాగే ఉంటారు అనేలా దీన్ని ఫోకస్ చేయటం మాత్రం ముమ్మాటికి తప్పని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇది మన వరకే అనుకుంటున్నాం కాని ఇక్కడ మించిన పైత్యం హాలీవుడ్ లోనూ ఉంది. కాస్టింగ్ కౌచ్ కు బాధితులుగా మారిన వాళ్ళు దానికి వ్యతిరేకంగా మీ టూ అనే ఆన్ లైన్ ఉద్యమాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.


ప్రఖ్యాత బాలీవుడ్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ కూడా దీని గురించి ఓపెన్ అయిపోయింది. తన కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం తిరిగినప్పుడు ఒక దర్శకుడు నగ్నంగా మారి తన వక్ష భాగాన్ని చూపించాలని డిమాండ్ చేసాడని అలా చేస్తేనే ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో వెంటనే నో చెప్పేసి బయటికి వచ్చేసిందట. అప్పుడు కాని ఈ రంగుల ప్రపంచంలో ఎన్ని ముళ్ళు ఉన్నాయో అర్థం అయ్యాయట. ఇక్కడ రాజీ పడి వేరే మార్గం లేక దర్శక నిర్మాతలు చెప్పినట్టు నడుచుకుని తమ మానాన్ని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారని తాను మాత్రం అటువంటి తప్పు ఎన్నడు చేయలేదని స్పష్టం చేసింది. తనను న్యూడ్ గా మారమన్న దర్శకుడు ఎవరో పేరు మాత్రం బయటికి చెప్పలేదు.


ఇప్పుడు ఈ మీ టూ కు మద్దతుగా ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. ఆ మధ్య ఒక ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాతను ఇదే విషయంలో అరెస్ట్ చేసారు. ఇప్పుడు ఇక్కడ కూడా వీటి గురించి స్వరం పెంచుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది కనక ముందు ముందు ఇంకెలాంటి కీలక పరిణామాలు జరుగుతాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. శ్రీరెడ్డి కన్నా ముందే మాధవి లతా - కస్తూరి - అర్చన లాంటి హీరొయిన్లు దీని గురించి ఇంటర్వ్యూలలో చెప్పినా పేర్లు ఆధారాలు చూపకపోవడంతో అన్ని మరుగున పడిపోయాయి.