కన్నీటి పర్యంతమైన ఐశ్వర్య రాయ్

కన్నీటి పర్యంతమైన ఐశ్వర్య రాయ్

మాజీ ప్రపంచ సుందరి, బచ్చన్ బహూ ఐశ్వర్య రాయ్ కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఆమె తండ్రి కృష్ణారాజ్‌ రాయ్‌ జయంతి పురస్కరించుకుని ముంబయిలోని స్మైల్‌ ట్రైన్ ఫౌండేషన్‌ ద్వారా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జరీ చేయించనున్నట్లు ప్రకటించారు. ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యతో కలిసి అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా కేక్ కోసేసి, తన తండ్రి జయంతి వేడుకలు నిర్వహించారు.

 

ఆ కార్యక్రమానికి వచ్చిన ఫొటోగ్రాఫర్లు ఆమె ఫొటోలు తీయడానికి అరుపులు, కేకలు వేయటంతో అక్కడ కాసేపు సేపు గందరగోళ వాతావరణం నెలకొంది. వాళ్లను నియంత్రించడం ఐశ్వర్య వల్ల కాలేదు. దీంతో ఆమె.. ‘‘ప్లీజ్ నాకు ఫొటోలు తీయకండి. ఇది సినిమా ప్రిమియర్ షో కాదు. పబ్లిక్ ఈవెంట్ కూడా కాదు. మీరెందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ కార్యక్రమం దేన్ని ఉద్దేశించిందో తెలుసుకుని గౌరవంగా ప్రవర్తించండి’’ అంటూ ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.

 

ఐశ్వర్య రాయ్ తండ్రి కృష్ణారాజ్‌ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. కృష్ణారాజ్‌ కూడా గ్రహణం మొర్రితోనే జన్మించారు. 2011లో ఆయన గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న దాదాపు 100 మంది చిన్నారులకు చికిత్స చేయించినట్లు ఐశ్వర్య ఈ సందర్భంగా తెలిపారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos