Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ షో చూస్తుంటే తిట్టేవాడిని: నాని

'బిగ్ బాస్' సీజన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే

hero nani special interview about big boss

'బిగ్ బాస్' సీజన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆద్యంతం ఈ షోని ఆసక్తికరంగా నడిపించారు. ఇప్పుడు సీజన్2 ని మొదలుపెట్టనున్నారు నిర్వాహకులు. జూన్ 10నుండి టెలికాస్ట్ కానున్న ఈ షోకి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించనున్నారు.'ఈసారి కొంచెం మసాలా' అంటూ నాని చేసిన హడావిడి మాములుగా లేదు. ఈ షోకి సంబంధించిన ముచ్చట్లు నాని మాటల్లో.. 

ఈ సమయంలో మీపై ఎలాంటి ప్రెషర్ ఉంది..? 
కొంచెం నెర్వస్ గా ఉంది. నిజానికి నేను బిగ్ బాస్ సీజన్ 1 చూడలేదు. ఎక్కడికి వెళ్లినా.. తారక్ ఎంత బాగా చేశాడో చెప్తున్నారు. ఆల్రెడీ ప్రూవ్ అయిన షోని టీమ్ సపోర్ట్ తో కచ్చితంగా సక్సెస్ చేస్తాననే నమ్మకం ఉంది. ఆడియన్స్ కు ఈ షో ఇంటరెస్టింగ్ గా ఉండబోతుందని అనే విషయాన్ని మాత్రం చెప్పగలను. 

హోస్ట్ గా మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీ రియాక్షన్ ఏంటి..? 
నేనెందుకు అనే డౌట్ వచ్చింది. అప్పుడు అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి ఇది నువ్వే చేయగలవు అని అన్నారు. మొదట నేను సూట్ అవుతానా లేదా అనుకున్నాను కానీ అరవింద్ గారు అంత నమ్మకంగా చెప్పడంతో చేయాలని నిర్ణయించుకున్నా.

తారక్ నుండి ఏమైనా టిప్స్ తీసుకున్నారా..? 
ఈ షో చేయాలని డిసైడ్ అయిన తరువాత తారక్ ను 'మహానటి' ఆడియో లో ఒకసారి కలిశాను. తరువాత తారక్ ఇంటికి వెళ్లి పెర్సనల్ గా కలిశాను. ''స్టేజ్ మీద మనం మనలాగే ఉంటే సరిపోతుంది నటించాల్సిన అవసరం లేదని'' ఇద్దరం చర్చించుకున్నాం. ప్రత్యేకంగా టిప్స్ ఏం ఇవ్వలేదు పైగా టిప్స్ ఫాలో అవ్వకూడదు అని చెప్పాడు.

తెలుగులో తారక్, హిందీలో సల్మాన్ బిగ్ బాస్ షోని హోస్ట్ చేశారు.. వారిద్దరిలో ఎవరిని ఫాలో అవుతారు..?
సల్మాన్, తారక్ ఇద్దరినీ ఫాలో అవ్వను.. నాకు అర్ధమైంది నేను చేసుకుంటూ వెళ్తాను. 

ఇప్పటివరకు స్టార్స్ మాత్రమే హోస్ట్ చేసిన బిగ్ బాస్ లాంటి షోని మీరు హోస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. సో ఆ స్టార్ స్టేటస్ ఫీల్ అవుతున్నారా..?
నేను స్టేటస్ చూడడం లేదు.. ఈ షో ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఈ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రతి షోలో ఉపయోగపడే ఓ అంశాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాం. 

వెండితెర నుండి బుల్లితెరకు రావడం ఎలా అనిపిస్తుంది..? 
సినిమా వేరు.. టీవీ వేరు.. కాదు.. రెండు కూడా ప్రేక్షకులను చేరుకోవడానికి ఒక మీడియా.. 

బిగ్ బాస్ ను కలిశారా..? 
లేదండీ.. మరో రెండు రోజుల్లో నిర్వాహకులు మొత్తం షో రూల్స్, ఎలా చేయాలనే విషయాలను వివరించనున్నారు. ఆ తరువాత బిగ్ బాస్ ను కలిసే ఛాన్స్ ఉంది. 

మీ ఫ్రెండ్స్ ఎవరూ ఈ షోలో వాళ్లని రికమెండ్ చేయమని అడగలేదా..?
నా స్నేహితులకు నేను రికమండ్ చేయనని తెలుసు అందుకే నన్ను ఎవరూ అడగలేదు. కానీ వారంతా నాతో మాట్లాడినప్పుడు ఈ షోపై వారికున్న క్రేజ్ చూశాను.. ఇంత పాపులరా అని ఫీల్ అయ్యాను. 

మీ ఇంట్లో వాళ్ల రియక్షన్ ఏంటి..?  
ఇంతకముందు ఇంట్లో 'బిగ్ బాస్' షో చూస్తుంటే తిట్టేవాడిని పనిపాటా లేదా షో చూస్తూ కూర్చున్నారు అని ఇప్పుడు నన్నే హోస్ట్ గా తీసుకొచ్చారు..(నవ్వుతూ). ఇప్పుడు వారంతా టీవీల నుండి అస్సలు కదలరు. 

బిగ్ బాస్ హౌస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది..?
ఇంతకుముందు తారక్ హైదరాబాద్ నుండి వీకెండ్స్ లో పూనైకి ట్రావెల్ చేసేవాడు. ఇప్పుడు నేను ఇక్కడే ఉండి షో హోస్ట్ చేయొచ్చు..హైదరాబాద్ లో పెట్టడం కంఫర్ట్ ఉంది.. షో అయిన తరువాత ఇంటికి వెళ్లి మా జున్ను గాడితో ఆడుకోవచ్చు. 

ఈ షోని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి..?
దీన్ని నేనొక ఛాలెంజ్ లా తీసుకున్నాను.  ఇలాంటి స్టేజ్ మీద మనం కూడా షో చేస్తే బాగుంటుందని.. ఆల్రెడీ బెంచ్ మార్క్ సెట్ చేసిన షో ఇంకా సక్సెస్ చేయాలి అంటే రెండితలు కష్టపడాలి.. అది నాకొక ఛాలెంజ్.  

నాగార్జున గారితో కలిసి సినిమాలో నటిస్తున్నారు కదా.. ఆయన దగ్గర నుండి ఏమైనా టిప్స్ తీసుకున్నారా..?
ఈ షో నేను హోస్ట్ చేస్తున్నానని తెలిసి టీమ్ లో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారని అడిగారు. నేను చెప్పగానే 'గుడ్ టీమ్ బాగా వస్తుందని' అన్నారు. మోరల్ సపోర్ట్ ఇచ్చారు.. టిప్స్ లాంటివేం ఇవ్వలేదు.  

మీ లైఫ్ లో బిగ్ బాస్ ఎవరు..?
మా ఆవిడ పేరు చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా(నవ్వుతూ..) నా లైఫ్ లో బిగ్ బాస్ ప్రేక్షకులే.. 

ఈ షోతో మీకు ఎలాంటి ఇమేజ్ వస్తుందనుకుంటున్నారు..? 
పక్కింటి కుర్రాడు నుండి మీ ఇంటికి వచ్చే ప్రమోషన్ వస్తుంది. 

బిగ్ బాస్ సీజన్ 1 లో తారక్ వంట చేశాడు.. మీరు కూడా సీజన్ 2 లో చేయబోతున్నారా..?
నాకు ఆమ్లెట్ వేయడం కూడా రాదు.. కావాలంటే తారక్ నే పిలిచి ఒకసారి చేయిద్దాం  అంటూ నవ్వేశాడు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios