ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో `హిట్‌3` మూవీ సక్సెస్‌ మీట్‌ని క్యాన్సిల్‌ చేయాలనే ఆలోచన వచ్చిందట. దీనికి సంబంధించి నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.   

పాకిస్తాన్‌తో భారత్‌ యుద్ధం చేస్తుంది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ దేశానికి గట్టి బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం సన్నద్దమైంది. పహల్గామ్‌లో పాక్‌ ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. దీనికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది తట్టుకోలేని పాక్‌ భారత్‌పై యుద్ధానికి తెగబడుతుంది. దీనికి మన సైనికులు అంతే దీటుగా బదులు చెబుతున్నారు. ఆ దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. 

వంద కోట్లు దాటిన నాని `హిట్‌ 3` మూవీ 

ఈ క్రమంలో ఇండియా పాకిస్తాన్‌ యుద్ధాన్ని ఉద్దేశించి హీరో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. పాకిస్తాన్‌కి ఆ సంతృప్తి కూడా మిగల్చం అంటూ వ్యాఖ్యానించారు. ఇంతకి ఆయన ఏం చెప్పాడంటే. నాని హీరోగా నటించిన `హిట్‌ 3` మూవీ గత నెలలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ విజయవంతంగా రన్‌ అవుతుంది. వంద కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేశారు. 

పాకిస్తాన్‌ కి ఆ సాటిస్ఫాక్షన్‌ ఇవ్వకూడదనే `హిట్‌ 3` సక్సెస్‌ మీట్‌ః నాని

అయితే పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతుంది. దేశంలో పరిస్థితులు బాగా లేవు, ఈ సమయంలో సక్సెస్‌ మీట్‌ అవసరమా? అనే సందిగ్దంలో పడ్డారట. ఈవెంట్‌ని క్యాన్సిల్‌ చేయాలనుకున్నారట. కానీ అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారట. పాకిస్తాన్‌ వల్ల మన దేశంలో ఎవరూ ఇబ్బంది పడటం లేదని, తమ దాడి వల్ల ఒక సినిమా ఈవెంట్‌ క్యాన్సిల్‌ అయ్యిందని చెప్పుకునే సాటిస్ఫాక్షన్‌ కూడా వాళ్లకి ఇవ్వకూడదని తాను ఈ నిర్ణయం తీసుకున్నామని, `హిట్‌ 3` సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేయాలని భావించామని హీరో నాని తెలిపారు. 

మనల్ని పాక్‌ టచ్‌ చేయలేదనే స్టేట్‌మెంట్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందిః నాని

ఆయన మాట్లాడుతూ, దేశంలో పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సక్సెస్‌ మీట్‌ పెట్టుకోవడం ఫర్లేదా? అనే చర్చ తమలో జరిగినప్పుడు నాకు ఒకటి అనిపించింది. పరిస్థితి ఇలా ఉందంటే అవతలివాళ్లు(పాకిస్తాన్‌) మనకు సమస్యని క్రియేట్‌ చేయాలని ప్రయత్నించారు. దానికి మన సైనికులు పద్ధతిగా, ఫోకస్డ్ గా వారికి బదులిచ్చారు. వాళ్లు చేసిన సమస్య కారణంగా ఇండియాలో ఒక చోట ఒక సినిమా సక్సెస్‌ మీట్‌ క్యాన్సిల్‌ అయ్యిందనే సాటిస్పాక్షన్‌ కూడా వాళ్లకి ఇవ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. మనల్ని ఏమీ టచ్‌ చేయలేకపోయారనే స్టేట్‌మెంట్‌ని కూడా పాస్‌ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. 

ఇండియన్‌ ఆర్మీకి `హిట్‌ 3` సెల్యూట్‌

అందుకే ఈ మూవీ సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకోవాలని, అదే సమయంలో ఇండియన్‌ ఆర్మీకి సెల్యూట్‌ చేయాలని ఈ కార్యక్రమం నిర్వహించాం. మన దేశంకోసం ముందుండి పోరాడుతున్న అన్ని విభాగాల సైనికులకు ట్రిబ్యూట్‌ తెలపడానికి మంచి అవకాశం అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించాం. మన సైనికులు ఉన్నారు కాబట్టే బయట అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. మన దేశం యదావిధంగా కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతున్నామంటే దానికి కారణం ఇండియన్‌ ఆర్మీ.ఈ సందర్భంగా వారికి సెల్యూట్‌ తెలియజేసుకుంటున్నాం` అని తెలిపారు నాని. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

ఇక నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన మూవీ `హిట్‌ 3`. శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. నాని నిర్మించారు. `హిట్‌` సిరీస్‌లో భాగంగా వచ్చిన మూడో చిత్రమిది. భారీ విజయాన్ని సాధించింది. ఇంకా థియేటర్లలో రచ్చ చేస్తుంది. ఈ సందర్భంగా సినిమాని ఆదరిస్తున్న ఆడియెన్స్ కి టీమ్‌ ధన్యవాదాలు తెలిపింది.