వంగవీటిపై అద్దిరిపోయే వెబ్ సిరీస్ తీస్తా,వర్మ నిజాలు దాచారు-జీవీ

First Published 26, Dec 2017, 8:06 PM IST
gv sudhakar naidu announces web series on vangaveeti
Highlights
  • వంగవీటి రంగా జీవితంపై సినిమా తీస్తానని గతంలో ప్రకటించిన జీవీ
  • తాజాగా వంగవీటిపై వెబ్ సిరీస్ తీస్తానని జీవీ నాయుడు ప్రకటన
  • ఆవేశంతో తొడగొడుతూ వంగవీటిపై అభిమానాన్ని చాటుకున్న జీవీ

వంగవీటి రంగా జీవిత చరిత్రపై సినీ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. రంగా జీవిత చరిత్రను వెబ్ సిరీస్‌‌ రూపంలో తెరకెక్కిస్తానని ఆయన చెప్పారు. వంగవీటి రంగా 29 వర్థంతి సందర్భంగా మంగళవారం రంగా విగ్రహానికి వంగవీటి రాధా, జీవి నివాళులర్పించారు.

రంగా జీవిత చరిత్రను 150 నుంచి 170 ఎపిసోడ్లలో సీరియల్ తీస్తానని చెప్పారు. తాను తీసే సీరియల్‌లో పది ఎపిసోడ్లు ఉంటాయని అన్నారు. రంగా జీవిత చరిత్ర మూడు గంటల నిడివికి కుదించే సినిమాకు సరిపోదని అన్నారు. అందుకే సీరియల్ తీయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

రంగా జీవిత చరిత్రను సినిమా తీయాలనేది దాసరి నారాయణ రావు కోరికని జీవీ తెలిపారు. రంగాపై సినిమా తీద్దామనుకుంటే 6గంటల కథ వచ్చిందని చెప్పారు. బాహుబలిని మించిన కథ రంగా జీవిత చరిత్ర అని అన్నారు. కుల రాజకీయాలు వద్దని చెప్పిన వ్యక్తి రంగా అని జీవి సుధాకర నాయుడు అన్నారు. రంగా విగ్రహానికి పూలమాల వేసిన ఆయన ఆ తర్వాత తొడగొట్టారు. దీంతో రంగా అభిమానులు హర్షధ్వానాలు చేశారు.

విజయవాడ బందరు రోడ్డులో గల రాఘవయ్య పార్కులోని రంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులు అర్పించారు. రంగా ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదని ఆయన అన్నారు.

మరోవైపు అనంతపురం జిల్లాలో 44వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంటలో జరిగిన వంగవీటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను జ్ఞాపకం చేసుకున్నారు.

loader