ఒకే సినిమాతో వారిద్దరి అసలైన ప్రయాణం మొదలైంది. ఒకే దర్శకుడు వారిద్దరికీ గురువు, గాడ్ ఫాదర్. తెలుగునాట ప్రముఖ హాస్యనటులైన బ్రహ్మానందం, గుండు హనుమంతరావులు ‘అహనా పెళ్లంట’ చిత్రంతో వెండితెరపై ఆరంగేట్రం చేశారు. హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు కామెడీ సినిమాలకు దశ-దిశ చూపించింది. కామెడీకి హీరోయిజాన్ని ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ కు, పిసినారితనాన్ని కల్ట్ హిట్ గా మార్చిన కోట శ్రీనివాసరావుకు, అరగుండు బ్రహ్మంగా అప్పుడే కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందానికి.. ఓవరాల్ గా తెలుగు చిత్ర పరిశ్రమకే ఒక మైలురాయి ఈ సినిమా.

ఇదే సినిమాతో.. కెరీర్ ప్రారంభించిన నటుడు మరొకరు ఉన్నారు. ఆయనే గుండు హనుమంతరావు. గుండు హనుమంతరావు ప్రస్థానం మొదలైంది ‘అహనాపెళ్లంట’ సినిమాతోనే. క్లైమాక్స్ లో వచ్చే పెళ్లి కొడుకు తండ్రి పాత్రలో గుండు హనమంతరావు నటించారు.

 

సినిమాలో ఆయనది ఒక చెవిటి మేలం పాత్ర. బ్రహ్మానందం నత్తికి, గుండు హనుమంతరావు చెవిటికి మధ్య జరిగే సీన్స్ లో వారిద్దరి మధ్య గొడవ కు, సన్నివేశాలకు.. వీక్షకులు కడుపుచెక్కలయ్యేలా నవ్వుకునే సీన్లను క్రియేట్ చేశారు జంధ్యాల. ఆ సినిమాతో బ్రహ్మానందానికి బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చింది. గుండు హనుమంతరావుకు కూడా గుర్తింపు వచ్చింది. అయితే.. బ్రహ్మానందం స్టార్ అయిపోయారు. తనదైన టైమింగ్ తో గుండు హనుమంతరావు ప్రత్యేకంగా నిలిచారు కానీ.. స్టార్‌డమ్ రాలేదు.

 

హనుమంతరావు ఎక్కువగా సహాయ పాత్రలకే పరిమితం అయ్యారు. అయితే సైడ్ కిక్ గా మాత్రం గుండు హనుమంతరావు తిరుగులేని నటుడు అనిపించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన బోలెడన్ని సినిమాల్లో.. ఆయన పక్కనే ఉండే పాత్రలో గుండు హనుమంతరావు తప్పకుండా కనిపిస్తూ వచ్చారు. సినిమాలకు ధీటుగా ‘అమృతం’ సీరియల్ తో చిన్న పిల్లలకు, పెద్దవాళ్లకు తేడా లేకుండా దగ్గరకావడం గుండు హనుమంతరావు కీర్తిని శాశ్వతంగా నిలుపుతుంది.

అయితే.. బోలెడంత ప్రతిభాపాటవం ఉన్నా స్టార్ కమేడియన్ కాకపోవడంతో తగినంత సంపాదన లేకుండా పోయింది. దీంతో ఆయన చివరి దశలో ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు. హనుమంతరావు చికిత్స కోసం మెగాస్టార్ చిరంజీవి సైతం ఆర్థిక సాయం అందించారు. కానీ విధి వక్రించింది. హనుమంతరావు తీరని  దూరాలకు వెళ్లిపోయారు.