అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో అగ్ర హీరోగా వెలుగొందారు. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం హీరో నానితో కలిసి 'దేవదాస్' అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు అక్కినేని నాగార్జున. రన్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నాగార్జున నటించబోతున్నారు. నిజానికి సినిమాలో ఆయనది గెస్ట్ రోల్ లాంటిదని సమాచారం. దీనికోసం నాగార్జున ఎందుకు ఒప్పుకున్నాడనేది ఇప్పుడు అందరి మనసుల్ని తొలిచేస్తుంది.

ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే టాలీవుడ్ లో కలిసి పని చేయడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఉన్నారు. అలాంటిది వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో  నటించడానికి కారణం లేకపోలేదు. చాలా ఏళ్ల క్రితం నాగార్జున హిందీలో నటించారు. ఆయన చివరిగా ఏం సినిమా చేశారో కూడా గుర్తులేదు. ఇప్పుడు ఉన్నట్టుండి బాలీవుడ్ పై ప్రేమ రావడానికి కారణం పబ్లిసిటీ అని తెలుస్తోంది. తెలుగులో నాగార్జున పేరు తెలియని వారుండరు. కానీ అదే పక్క రాష్ట్రానికి వెళ్తే మాత్రం ఆయన ఎవరో కూడా గుర్తు పట్టరు.

తనకంటే జూనియర్లు అయిన వారికి నేషనల్ వైడ్ గా గుర్తింపు లభిస్తుంటే నాగార్జున మాత్రం ఒక భాషకే పరిమితం అవ్వడం ఇష్టం లేక ఇప్పుడు ఇతర భాషల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. చిరంజీవి లాంటి నటులు కూడా ఈ ఏజ్ లో 'సై రా' వంటి ప్రాజెక్ట్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 
ఇప్పుడు నాగార్జున కూడా తన క్రేజ్ ను పెంచుకునే పని పడ్డాడని అందుకే బాలీవుడ్ పై మక్కువ చూపుతున్నారని టాక్.