నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఇవాళ్టికి యూట్యూబ్ లో 40 లక్షల వ్యూస్ సంపాదించి టాలీవుడ్ లో రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సరికొత్త రికార్డు ఆవిష్కరణ సందర్భంగా నందమూరి అభిమానులు సంబరాలు కూడా జరుపుకుంటున్నారు.
 

అయితే రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఇప్పుడు సినిమాపండితుల మధ్య చర్చనీయాంశమయింది. గౌతమీపుత్ర శాతకర్ణి కథాంశం చారిత్రకం కావటంతో అనివార్యంగానే బాహుబలితో పోలికలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ నటి హేమమాలిని పోషిస్తున్న మహారాణి గౌతమీ బాలశ్రీ పాత్ర బాహుబలిలోని మహారాణి శివగామిలాగానే ఉందని కొందరంటున్నారు. మరోవైపు శాతకర్ణిలోని రెండుపాటలు గత ఏడాది విడుదలైన బాలీవుడ్ చిత్రం బాజీరావ్ మస్తానీలోని పాటలను కాపి కొట్టి కంపోజ్ చేశారని మరో వాదన వినబడుతోంది(బాజీరావ్ మస్తానీ చిత్ర దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. దానికి సంగీతాన్ని అందించిన చిరంతన్ భట్టే గౌతమీపుత్ర శాతకర్ణికి సంగీతాన్ని అందిస్తున్నారు). ఇదిలాఉంటే వీటన్నంటినీ తలదన్నే కొత్త సమాచారం ఇప్పుడు బయటకొచ్చింది. 
 

అమెరికాలో ఫాంటసీ డ్రామా సబ్జెక్టుతో అత్యంత ప్రజాదరణ పొందిన  టీవీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లోని పలు సీన్లను క్రిష్ యథాతథంగా దించేసినట్లు కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నతెలుగు మూవీ క్రిటిక్ వెనిగళ్ళ మోహన్  ఆధారాలతోసహా సోషల్ మీడియాలో బయటపెట్టారు. గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ లోని మూడు ముఖ్యమైన సీన్లను ఎత్తి చూపుతూ, అవి మూడూ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్ లోనివేనని మోహన్  నిరూపించారు. 

                                                                                                                            

1) శాతకర్ణి తల్లి గౌతమీ బాలశ్రీ- 33 కరవాలాలు కరిగించి ఒక మహాఖడ్గాన్ని తయారు చేయించండి అని చెబుతారు: గేమ్ ఆఫ్ ధ్రోన్స్ లో వార్ ఆఫ్ కాంక్వెస్ట్ లో ఓడిపోయినవారి 1,000 కత్తులను కరిగించి ఏగాన్ అనే రాజు సింహాసనం చేయిస్తాడు.

                   

      

                                                                                                

2) శాతకర్ణి భార్య పాత్రధారి శ్రియ భర్తతో "ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు ఇంకో బిడ్డను యుధ్ధానికి తీసుకెళుతున్నారు. మీరు మనిషేనా" అని నిలదీస్తుంది: గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో నెడ్ స్టార్క్ పాత్రనుద్దేశించి అతని భార్య 
కేట్ స్టార్క్: 17 years ago you rode off with Robert Baratheon to war. A year later you came back with another woman's son. And now you are leaving again. 
నెడ్ స్టార్క్: I have no choice.
కేట్ స్టార్క్: That's what men always say when honor calls

                                                                                                                              
 

 

3) సముద్రంలో జరిగే యుధ్ధానికి సంబంధించిన సీన్లలో కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ను క్రిష్ పక్కాగా ఫాలో అయిపోయారు. ఈ క్రింది చిత్రాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది.
 

అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఒకటి ఉంది. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్ర కథ పూర్తిగా నూటికి నూరుపాళ్ళూ ఒరిజినల్. అది మన సొంత తెలుగు రాజు, శకపురుషుడు అయిన శాతకర్ణి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాయే(శాతకర్ణి భారతదేశాన్నంతటినీ పాలించిన తెలుగు చక్రవర్తి. భారతీయ పంచాంగం ఇప్పటికీ ఆయన పేరుమీదే చలామణీ అవుతోంది). అయితే ఈ సినిమా కథనంలో మాత్రం క్రిష్ పూర్తిగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

క్రిష్ సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో సినిమా తీస్తాడని ఒక మంచి ఇమేజ్ ఉంది. అయితే అదే సమయంలో హాలీవుడ్ సినిమాలను కాపీ కొడతాడని సినిమా పండితులు చేసే విమర్శ కూడా బలంగా వినబడుతోంది. ఆయన మొదటి సినిమా గమ్యం మోటార్ సైకిల్ డైరీస్ చిత్రం, ప్రోడిగల్ డాటర్ అనే నవల ఆధారంగా తీశారని, ఇక వేదం చిత్రం మల్టిపుల్ నేరేటివ్ అనే కాన్సెప్ట్ తో రూపొందిన హాలీవుడ్ చిత్రం 'క్రాష్' ఆధారంగా రూపొందిందని అంటారు. అయితే వేదం సినిమాలో నాలుగు వేర్వేరు కథలను కలిపిన విధానం సీమ్ లేస్ గా బాగుందని విమర్శకులు కూడా ప్రశంసించారు.

 

కృష్ణం వందే జగద్గురుం సినిమా కథపై ఎలాంటి 'కాపీ' విమర్శలూ రాలేదుగానీ, వరుణ్ తేజ్ హీరోగా తీసిన కంచె సినిమా డియర్ జాన్ అనే హాలీవుడ్ సినిమాకు కాపీ అని విమర్శలు వినబడ్డాయి. ఆ మధ్య బాలీవుడ్ లో తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే చిత్రం ఎలాగూ ఠాగూర్(తమిళంలో రమణ) చిత్రం రీమేకేననుకోండి. ఇక తాజాగాఇప్పుడు శాతకర్ణి చిత్రంలో ఇలా సీన్లను కాపీకొడుతున్నట్లు బయటపడింది.