సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీ విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. 2018 సంక్రాంతి బరితో భరత్ ఉంటాడని మొదట వార్తలు వచ్చినా.. పవన్ ‘అజ్ఞాత‌వాసి’, బాలయ్య ‘సింహా’ సినిమాలు ముందే సంక్రాంతి బెర్త్‌ను కన్ఫామ్ చేసుకోవడంతో సమ్మర్‌కు పోస్ట్‌పోన్ చేసుకున్నారు. 2018 ఏప్రిల్ 27న ప్రపంచ వ్యాప్తంగా ‘భరత్ అనే నేను’ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే అదే రోజున అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ కూడా విడుదల కానుంది. దీంతో ఒకేరోజున రెండు పెద్ద సినిమాలు విడుదలైతే కలెక్షన్స్‌పై ప్రభావం చూపే అవకాశం లేకపోవడంతో ‘భరత్ అనే నేను’ సినిమాను ఒకరోజు ముందుగా అంటే ఏప్రిల్ 26న విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత డి.వి.వి.దానయ్య. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పుణెలో మరో షెడ్యూల్‌ ఉంటుందని, షూటింగ్ అనంతర కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసి ఏప్రిల్ 26న ‘భరత్ అనే నేను’ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.